Jagan Mohan Reddy: చంద్రబాబు గారూ... ఇదేం రాక్షసత్వం... మా వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?: జగన్

Jagan Slams Chandrababu Over Arrests of YSRCP Protestors
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ ఆందోళనలు
  • నిరసనకారులపై లాఠీఛార్జ్, అరెస్టులను ఖండించిన జగన్
  • ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఘాటు విమర్శలు
  • ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేదాకా పోరాటం ఆగదని హెచ్చరిక
  • ఆందోళనల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులకు, విద్యార్థులకు అభినందనలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ఆందోళనలను అణచివేస్తున్నారని ఆ పార్టీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ నాయకులు, విద్యార్థులపై లాఠీఛార్జులు, అరెస్టులు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

చంద్రబాబు గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైసీపీ యూత్‌, స్టూడెంట్‌ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? లాఠీచార్జ్ లు ఎందుకు చేశారు? గృహనిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు? ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? 

మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంటు మెడికల్‌ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపలకూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులచేత దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఇది కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం?

మీరింతగా తెగబడినా ప్రజాప్రయోజనాల పరిరక్షణకోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితోపాటు యువతీయువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసనమండలిలోనూ, ఇటు మెడికల్‌ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకోసం, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయి" అంటూ జగన్ హెచ్చరించారు. 
Jagan Mohan Reddy
YS Jagan
Chandrababu Naidu
Andhra Pradesh politics
Medical colleges privatization
YSRCP protests
Student protests
Government medical colleges
AP government
Political arrests

More Telugu News