Chandrababu Naidu: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు

Three YCP MLCs Join TDP in Presence of Chandrababu Naidu
  • తెలుగుదేశం పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలు
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
  • చేరినవారిలో మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న కర్రి పద్మశ్రీ
  • సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం
  • హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా, పలువురు ముఖ్య నేతలు
జగన్ నాయకత్వంలోని వైసీపీకి భారీ షాక్ తగిలింది. తాజాగా, ముగ్గురు శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు.

అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వారికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ఎమ్మెల్సీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చేరికతో శాసనమండలిలో అధికార పార్టీ బలం మరింత పెరిగినట్లయింది.

ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు సునీల్, విజయశ్రీ, పులివర్తి నానితో పాటు ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, అనురాధ, చిరంజీవి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు, రామ్‌గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. వీరితో పాటు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, ఈ ముగ్గురు ఎమ్మెల్సీలలో బల్లి కల్యాణ్ చక్రవర్తి పదవీకాలం 2027 వరకు ఉండగా... మర్రి రాజశేఖర్, పద్మశ్రీ పదవీకాలం 2029 వరకు ఉంది. ఇంతకుముందే వైసీపీ నుంచి జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడం తెలిసిందే. 
Chandrababu Naidu
TDP
YCP
YS Jagan
Andhra Pradesh politics
MLCs join TDP
Marri Rajasekhar
Balli Kalyan Chakravarthi
Karri Padmasri
Telugu Desam Party

More Telugu News