Chandrababu Naidu: జగన్ చేతకాని పాలనలో పోలవరం పనులు రివర్స్ అయ్యాయి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Jagan Over Polavaram Project Delays
  • అసెంబ్లీలో సాగునీటి రంగంపై ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
  • గత ప్రభుత్వ చేతకానితనంతోనే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని విమర్శ
  • 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ పూర్తి చేసి చూపిస్తామని స్పష్టం
  • రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం
  • గత ఐదేళ్లలో సాగునీటిపై అతి తక్కువ ఖర్చు చేశారంటూ గణాంకాలతో విమర్శ
  • 738 కిలోమీటర్ల నుంచి నీళ్లిచ్చి కుప్పం ప్రజల రుణం తీర్చుకున్నానన్న సీఎం
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తిరోగమనంలో పయనించిందని, విధ్వంసంతో పరిపాలన ప్రారంభించిన వారు విధ్వంసంతోనే చరిత్రలో నిలిచిపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ చేతకాని పాలనలో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో నీటి సమర్థ నిర్వహణపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. గత పాలకుల అసమర్థత, అహంకారం వల్లే రూ. 400 కోట్లతో నిర్మించిన పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లను మార్చవద్దని కేంద్ర జలసంఘం సూచించినా పెడచెవిన పెట్టడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసి, పోలవరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు సభకు హామీ ఇచ్చారు.

సాగునీటి రంగంపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వివరిస్తూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని గణాంకాలతో సహా ఎత్తిచూపారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ. 68,417 కోట్లు ఖర్చు చేస్తే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 28,376 కోట్లు మాత్రమే వెచ్చించిందని విమర్శించారు. 

తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఒక్క ఏడాదిలోనే బడ్జెట్‌లో రూ. 12,454 కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో 72 శాతం పూర్తయిన పోలవరం పనులను, గత ఐదేళ్లలో కేవలం 3.84 శాతం మాత్రమే ముందుకు తీసుకెళ్లారని, ఇది వారి చేతకానితనానికి నిదర్శనమని అన్నారు.

రాష్ట్రంలోని నదుల అనుసంధానం ద్వారానే శాశ్వత నీటి భద్రత సాధ్యమని తాను బలంగా నమ్ముతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు. దేశంలోనే తొలిసారిగా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. రానున్న కాలంలో రాష్ట్రంలోని అన్ని నదులను అనుసంధానం చేసి, ప్రతి ఎకరాకు నీరందిస్తామని స్పష్టం చేశారు. 

ఒకప్పుడు రాయలసీమలో వేరుశనగ వేసిన రైతులకు పెట్టుబడి కూడా రాని దుస్థితి ఉండేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడుతుంటే, శ్రీశైలం ఎడమగట్టు కాలువ నుంచి ఎత్తిపోతల ద్వారా నీరందించి ఆ సమస్యను పరిష్కరించిన చరిత్ర తమదేనని చెప్పారు.

ఈ ఏడాది దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలోని జలాశయాలు 94 శాతం నిండాయని, సమర్థవంతమైన నీటి నిర్వహణతో భూగర్భ జలాలు కూడా పెరిగాయని సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాల్లో భూగర్భ జలాలను పెంచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. దివంగత ఎన్టీఆర్ సంకల్పించిన హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల దూరం నీటిని తరలించి, తన నియోజకవర్గమైన కుప్పం ప్రజల రుణం తీర్చుకున్నానని చంద్రబాబు భావోద్వేగంతో ప్రస్తావించారు. 

రూ. 3,800 కోట్లతో 468 చెరువులను నింపే కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపితేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని స్పష్టం చేయడం వల్లే, నాడు ప్రధాని మోదీ సహకారంతో ఆ ప్రాజెక్టు ఈ స్థాయికి వచ్చిందని సీఎం తెలిపారు.
Chandrababu Naidu
Polavaram Project
Andhra Pradesh
Jagan Mohan Reddy
Irrigation Projects
River Linking
Water Management
TDP Government
YS Jagan Government
AP Politics

More Telugu News