Bhumana Karunakar Reddy: బ్రహ్మోత్సవాల వేళ అలజడికి భూమన కుట్ర: భానుప్రకాశ్ రెడ్డి

Bhanu Prakash Reddy Alleges Conspiracy by Bhumana During Brahmotsavam
  • కొనసాగుతున్న అలిపిరి విగ్రహం వివాదం
  • 23న పోలీసు విచారణకు వస్తానన్న భూమన
  • 24న తిరుమల వస్తున్న సీఎం చంద్రబాబు
  • 23న వస్తానని భూమన చెప్పడం వెనుక కుట్ర ఉందన్న భాను
  • భూమనపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని వెల్లడి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డిపై ప్రస్తుత బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ముందు తిరుమలలో అలజడి సృష్టించేందుకు భూమన ఒక రహస్య అజెండాతో పనిచేస్తున్నారని ఆయన తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. 

అలిపిరి వద్ద విగ్రహానికి సంబంధించిన ప్రచారం కేసులో పోలీసులు జారీ చేసిన 41ఏ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు భూమన కరుణాకరరెడ్డి ఎంచుకున్న సమయంపై భానుప్రకాశ్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 24న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని, అయితే భూమన మాత్రం దానికి ఒక్కరోజు ముందు, అంటే 23వ తేదీన పోలీసుల ముందుకు వస్తానని చెప్పడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.

"సీఎం పర్యటనకు ఒక్కరోజు ముందు తిరుమలకు వస్తానని చెప్పడంలో భూమన రహస్య అజెండా స్పష్టంగా కనిపిస్తోంది. బ్రహ్మోత్సవాల సమయంలో గందరగోళం సృష్టించాలనే ఆయన ప్రయత్నిస్తున్నట్లు ఉంది" అని భాను అన్నారు. కరుణాకరరెడ్డి వంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పాలో టీటీడీకి బాగా తెలుసని ఆయన హెచ్చరించారు. 
Bhumana Karunakar Reddy
TTD
Tirumala
Bhanu Prakash Reddy
Chandrababu Naidu
Brahmotsavam
Tirupati
Andhra Pradesh Politics
TTD Chairman
Alipiri

More Telugu News