Vishal Soni: కోట్ల రూపాయల అప్పు... చనిపోయినట్లు డ్రామా ఆడిన బీజేపీ నేత కొడుకు!

Vishal Soni BJP Leader Son Fakes Death for Loan Evasion
  • రూ.1.40 కోట్ల బ్యాంకు అప్పు ఎగవేతకు బీజేపీ నేత కుమారుడి ప్లాన్
  • నదిలో కారును తోసేసి తాను చనిపోయినట్లు నాటకం
  • 17 రోజుల తర్వాత మొబైల్ సిగ్నల్ ఆధారంగా మహారాష్ట్రలో అరెస్ట్
  • డెత్ సర్టిఫికెట్‌తో లోన్ మాఫీ అవుతుందని ఆశపడినట్లు వెల్లడి
  • చట్టంలో లొసుగులు... శిక్ష పడకుండా కుటుంబానికి అప్పగింత
కోట్ల రూపాయల బ్యాంకు రుణాన్ని ఎగవేసేందుకు ఓ బీజేపీ నేత కుమారుడు ఏకంగా తాను చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. సినిమా కథను తలపించేలా సాగిన ఈ నాటకానికి పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తెరదించారు. అయితే, చివరకు చట్టంలోని ఓ లొసుగు కారణంగా అతనికి ఎలాంటి శిక్ష పడకుండానే ఇంటికి పంపించడం గమనార్హం.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌కు చెందిన బీజేపీ నేత మహేశ్ సోనీ కుమారుడు విశాల్ సోనీ, పలు బ్యాంకుల నుంచి సుమారు రూ.1.40 కోట్ల రుణం తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చే మార్గం లేక, తాను చనిపోయినట్లు నమ్మిస్తే రుణాలు రద్దవుతాయని ఓ పథకం వేశాడు. ఈ క్రమంలో తన కారును కలిసింధ్ నదిలోకి తోసేసి, తాను కూడా అందులో పడి మరణించినట్లు అందరినీ నమ్మించాలని ప్రయత్నించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

విశాల్ గల్లంతైనట్లు సమాచారం అందడంతో, రెస్క్యూ సిబ్బంది సుమారు 10 రోజుల పాటు నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో నుంచి కారును వెలికితీసి అది విశాల్‌దేనని నిర్ధారించుకున్నారు. కానీ, అతని ఆచూకీ మాత్రం లభించలేదు. మరో వారం గడిచినా మృతదేహం దొరకకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో విశాల్ సోనీ మొబైల్ కాల్ డేటాను పరిశీలించగా, చివరి సిగ్నల్స్ మహారాష్ట్రలో ఉన్నట్లు గుర్తించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సిగ్నల్స్ ఆధారంగా మహారాష్ట్రలోని శంభాజీ నగర్ జిల్లా ఫర్దాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశాల్ సోనీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తనకు ఉన్న రూ.1.40 కోట్ల అప్పుల నుంచి తప్పించుకోవడానికే ఈ నాటకం ఆడినట్లు, మరణ ధృవీకరణ పత్రం పొందితే బ్యాంకులు రుణాన్ని మాఫీ చేస్తాయని భావించినట్లు పోలీసులకు వివరించాడు.

అయితే, ఒక వ్యక్తి తాను మరణించినట్టు నమ్మించే ప్రయత్నంపై కేసు నమోదు చేయడానికి రాజ్యాంగంలో నిర్దిష్ట నిబంధనలు లేకపోవడంతో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో విశాల్ సోనీని కుటుంబసభ్యులకు అప్పగించి పంపించివేశారు.
Vishal Soni
BJP leader son
bank loan fraud
fake death
loan repayment
Rajgarh
Madhya Pradesh
crime news

More Telugu News