Venkatesh: పాము కరిచిందని దాని తల కొరికేశాడు... ఆ తర్వాత ఏం జరిగిందంటే...!

Venkatesh bit snake head after snake bite in Tirupati district
  • తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో వింత ఘటన
  • మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి నల్లత్రాచు కాటు
  • కోపంతో పాము తల కొరికి చంపేసిన బాధితుడు
  • చచ్చిన పామును ఇంటికి తీసుకెళ్లి పక్కనే పెట్టుకుని నిద్రపోయిన వైనం
  • అర్ధరాత్రి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలింపు
  • ప్రస్తుతం తిరుపతి రుయాలో చికిత్స
పాము కాటేస్తే ఆసుపత్రికి పరుగులు తీయడం సాధారణం. కానీ, ఓ వ్యక్తి మాత్రం తనకు కాటేసిన పాముపై వింతగా ప్రతీకారం తీర్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతను, తనను కాటేసిన నల్లత్రాచును పట్టుకుని దాని తలను కొరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా, ఆ పామును ఇంటికి తీసుకెళ్లి పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. ఈ వింత ఘటన తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, చియ్యవరం గ్రామంలో స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

వివరాల్లోకి వెళితే... చియ్యవరం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి గురువారం రాత్రి మద్యం సేవించి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దారిలో అతడిని ఓ నల్లత్రాచు కాటేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్, ఆ పామును వెంబడించి పట్టుకున్నాడు. కోపంతో దాని తలను నోటితో కొరికి చంపేశాడు. అనంతరం ఆ చచ్చిన పామును తనతో పాటు ఇంటికి తీసుకెళ్లి, దాని పక్కనే పడుకుని నిద్రపోయాడు.

అయితే, అర్ధరాత్రి సమయంలో పాము విషం ఒంటికెక్కి వెంకటేశ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శుక్రవారం ఉదయం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం వెంకటేశ్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మద్యం మత్తులో వెంకటేశ్ చేసిన ఈ విపరీత చర్య గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Venkatesh
snake bite
snake revenge
Tottambedu
Chiyyavaram
Tirupati district
snake venom
Srikalahasti
RUIA hospital
black cobra

More Telugu News