Revanth Reddy: తెలంగాణలో కూడా ఓ ట్రంప్ ఉండేవాడు: ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి

Revanth Reddy Compares KCR to Trump at Delhi Forum
  • కేసీఆర్ ను ట్రంప్ తో పోల్చిన రేవంత్
  • ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరిక
  • ప్రజలు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపారని వ్యాఖ్య
తెలంగాణలో గతంలో ఒక డొనాల్డ్ ట్రంప్ ఉండేవారని, ఆయన పాలన నచ్చకే ప్రజలు మూకుమ్మడిగా ఓడించి ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ విమర్శలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన 'బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం' సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, "ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు ఎక్కువ రోజులు కొనసాగవు. వాళ్లు రాత్రి కలలో అనుకున్నది పగలు అమలు చేస్తుంటారు. ట్రంప్ ఒకరోజు ప్రధాని మోదీ తన మిత్రుడు అంటారు, మరుసటి రోజే భారత్‌పై 50 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తానని బెదిరిస్తారు" అని విమర్శించారు. భవిష్యత్తులో భారతీయులకు వీసాలు ఇవ్వకపోతే నష్టపోయేది అమెరికానే అని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం వద్ద స్పష్టమైన రూట్‌మ్యాప్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే ప్రణాళికలో భాగంగా, త్వరలోనే 3,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న నాన్-ఈవీ బస్సులను పూర్తిగా గ్రామాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు.

అలాగే, హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు ప్రతిపాదన ఉందని, ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన 'ఈగల్ స్క్వాడ్' సమర్థవంతంగా పనిచేస్తోందని, ఇటీవల విడుదలైన పోలీస్ ర్యాంకింగ్‌లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 
Revanth Reddy
Telangana
KCR
Donald Trump
Hyderabad
Electric Buses
Business Standard Annual Forum
Regional Ring Road
Eagle Squad
Telangana Development

More Telugu News