PM Modi: వీధి వ్యాపారికి, సీఈఓకి ఒకే టెక్నాలజీ: ప్రధాని మోదీ

Technology has become Indias greatest equaliser says PM Modi
  • టెక్నాలజీనే దేశంలో అతిపెద్ద ఈక్వలైజర్ అన్న‌ ప్రధాని మోదీ
  • వీధి వ్యాపారి, కార్పొరేట్ అధికారికి ఒకే యూపీఐ విధానమ‌ని వెల్ల‌డి
  • అంత్యోదయ స్ఫూర్తితోనే ప్రతి డిజిటల్ పథకం అమలు చేస్తున్నామ‌న్న మంత్రి అశ్విని వైష్ణవ్ 
  • గుజరాత్ అనుభవంతో దేశంలో డిజిటల్ విప్లవమ‌ని వ్యాఖ్య‌
దేశంలో టెక్నాలజీనే అతిపెద్ద ఈక్వలైజర్ (సమానత్వ సాధనం) అని, ఇది వీధి వ్యాపారి నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ వరకు ప్రతి ఒక్కరికీ సాధికారతను అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాసిన ఒక వ్యాసానికి ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో స్పందించారు.

గతంలో ప్రభుత్వ పత్రం కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని అన్నీ మొబైల్ ఫోన్‌లోనే అందుబాటులోకి వచ్చాయని అశ్విని వైష్ణవ్ తన వ్యాసంలో వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ, "ఇండియా స్టాక్, యూపీఐ, జామ్ ట్రినిటీ, కొవిన్ వంటి కార్యక్రమాలతో ఆవిష్కరణలు, సమ్మిళిత వృద్ధి ప్రజల జీవితాలను మార్చాయి. పాలన మెరుగుపడటంతో పాటు ప్రపంచ వేదికపై భారత్ పాత్రను బలోపేతం చేశాయి" అని మోదీ తెలిపారు.

అంతకుముందు తన వ్యాసంలో... ప్రధాని మోదీ దార్శనికతలో టెక్నాలజీకి ఎలాంటి అంతరాలు లేవని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. "ముంబైలోని ఒక వీధి వ్యాపారి, ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఇద్దరూ ఒకే యూపీఐ చెల్లింపుల వ్యవస్థను వాడుతున్నారు. ఇదే అసలైన సమానత్వం. క్యూలో నిల్చున్న చివరి వ్యక్తికి కూడా ఫలాలు అందాలనే 'అంత్యోదయ' స్ఫూర్తితోనే ప్రతి డిజిటల్ కార్యక్రమం రూపుదిద్దుకుంది" అని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రారంభించిన ప్రయోగాలు, దేశవ్యాప్త డిజిటల్ విప్లవానికి పునాది వేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జ్యోతిగ్రామ్, నర్మదా కాలువపై సోలార్ ప్యానెళ్లు, ఇ-ధర, స్వాగత్ వంటి పథకాలతో టెక్నాలజీని పాలనలో భాగం చేశారని వైష్ణవ్ గుర్తుచేశారు. 2014లో ప్రధాని అయ్యాక గుజరాత్ అనుభవాన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారని అన్నారు.

దీనిలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మౌలిక సదుపాయాలైన 'ఇండియా స్టాక్'కు రూపకల్పన జరిగిందని తెలిపారు. 'జామ్' (జన్ ధన్-ఆధార్-మొబైల్) త్రయంతో 53 కోట్లకు పైగా ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చారని వివరించారు. ఆధార్ ద్వారా 142 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లభించిందని, ప్రభుత్వ సేవలు సులభతరం అయ్యాయని చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంతో దళారుల వ్యవస్థకు తెరపడిందని, దీనివల్ల ఇప్పటివరకు రూ. 4.3 లక్షల కోట్లకు పైగా ప్రజాధనం ఆదా అయిందని ఆయన తన వ్యాసంలో స్పష్టం చేశారు.
PM Modi
Narendra Modi
UPI
India Stack
Digital India
Ashwini Vaishnaw
JAM trinity
Technology
Digital Payments
Direct Benefit Transfer
Aadhaar

More Telugu News