Osmania Hospital: పోలీసులకు, డాక్టర్లకు చుక్కలు చూపించిన రిమాండ్ ఖైదీలు.. ఆసుపత్రిలో విధ్వంసం

Remand Prisoners Create Ruckus at Osmania Hospital
  • సంగారెడ్డి జైలులో ఇద్దరు రిమాండ్ ఖైదీల వీరంగం
  • గంజాయి దొరక్కపోవడంతో మానసిక గందరగోళం
  • బ్యాటరీ, పెన్ను మూత మింగి ఆత్మహత్యాయత్నం
  • ఉస్మానియా ఆసుపత్రిలో మంచాలు, కిటికీ అద్దాల ధ్వంసం
  • గాజు పెంకులు మింగేస్తామంటూ పోలీసులకు, వైద్యులకు బెదిరింపులు
  • హత్యాయత్నం కేసులో అరెస్టయిన నిందితులు
ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు పోలీసులకు, వైద్య సిబ్బందికి చుక్కలు చూపించారు. గంజాయి మత్తుకు బానిసలైన ఆ ఇద్దరూ వార్డులోని మంచాన్ని విరగ్గొట్టి, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా, ఆ గాజు పెంకులతో ఒంటిపై గాట్లు పెట్టుకుని, వాటిని మింగేస్తామంటూ గంటల తరబడి హంగామా చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.

ఓ హత్యాయత్నం కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. గంజాయికి అలవాటుపడిన వీరికి జైలులో అది దొరక్కపోవడంతో మానసికంగా అదుపు తప్పారు. ఈ క్రమంలో ఈ నెల  15న జైలు గదిలోని గోడ గడియారం బ్యాటరీని, ఓ పెన్ను మూతను మింగేశారు. కడుపులో నొప్పిగా ఉందంటూ అధికారులకు చెప్పడంతో వారిని వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్యం చేయించుకోవడానికి నిరాకరించి, వైద్య సిబ్బందిని దుర్భాషలాడుతూ వింతగా ప్రవర్తించారు. పరిస్థితి చేయిదాటడంతో జైలు అధికారులు మెరుగైన చికిత్స కోసం వారిని అఫ్జల్‌గంజ్ పోలీసుల సహాయంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ వారి ప్రవర్తన మరింత హింసాత్మకంగా మారింది. వైద్యులను, పోలీసులను తిడుతూ గట్టిగా కేకలు వేశారు. వార్డులోని ఓ మంచాన్ని విరగ్గొట్టి, దాని ముక్కతో కిటికీ అద్దాలు పగలగొట్టారు. అనంతరం ఆ గాజు పెంకులను నోట్లో పెట్టుకుని, మింగేస్తామంటూ బెదిరించడంతో అక్కడున్న వారంతా హడలిపోయారు. తీవ్ర గందరగోళం మధ్య పోలీసులు, వైద్యులు వారిని అతికష్టం మీద అదుపులోకి తెచ్చారు. గంజాయి దొరక్కపోవడం వల్లే ఖైదీలు ఈ విధంగా ప్రవర్తించినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Osmania Hospital
Remand Prisoners
Hyderabad
Sangareddy Jail
Ganja Addiction
Crime
Suicide Attempt
Hospital Vandalism

More Telugu News