Raghurama Krishnam Raju: ఒక పేదవాడు తనకోసం కట్టుకోవాలనుకున్న చిన్న గూడు... రుషికొండ ప్యాలెస్ పై రఘురామ సెటైర్లు

Raghurama Krishnam Raju Satires on Rushikonda Building
  • రుషికొండ భవనాన్ని కూల్చొద్దని సూచించిన రఘురామకృష్ణరాజు
  • ‘ఒక నియంత కట్టుకున్న గూడు’గా ప్రజలకు చూపించాలని వ్యాఖ్య
  • టికెట్ పెట్టి ప్రజాధనాన్ని తిరిగి రాబట్టాలని ప్రభుత్వానికి సలహా
  • అది జగన్ కట్టుకున్న ఇల్లు కాదు, రాజకీయ సమాధి అని ఎద్దేవా
"ఒక పేదవాడు తనకోసం కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇది. దీన్ని కూల్చివేయొద్దు. ప్రజలు చూసేందుకు వీలుగా టికెట్ పెట్టండి" అంటూ రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనంపై అసెంబ్లీలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజాధనంతో నిర్మించిన ఈ కట్టడాన్ని రాష్ట్ర ఆస్తిగా పరిగణించి, దాని ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

గత ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణంపై తాను చేసిన న్యాయపోరాటాన్ని రఘురామకృష్ణరాజు గుర్తు చేసుకున్నారు. కేవలం 22,000 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని ఉల్లంఘించి లక్ష చదరపు అడుగులకు పైగా నిర్మించారని ఆరోపించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి, ప్రజలను, న్యాయవ్యవస్థను మోసం చేశారని ఆయన విమర్శించారు.

ఈ భవనంపై రూ.500 కోట్లు ఖర్చు చేయడం ద్వారా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారని రఘురామ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఆ రూ.500 కోట్ల దుర్వినియోగం వల్లే ఆయనపై వ్యతిరేకత పెరిగి, రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడింది. కాబట్టి ఆ తప్పును మనం క్షమించేయొచ్చు" అని ఆయన చమత్కరించారు. ముంతాజ్ కోసం షాజహాన్ కట్టిన తాజ్‌మహల్‌ లాగే, ఒక నియంత కట్టుకున్న భవనంగా దీనికి గుర్తింపు తెచ్చి, మాన్యుమెంట్‌గా మార్చాలని ఆయన కోరారు.
Raghurama Krishnam Raju
Rushikonda
Andhra Pradesh
Jagan Mohan Reddy
Tourism
Supreme Court
illegal construction
political satire
public funds
controversy

More Telugu News