Fentanyl: ఫెంటానిల్ ఎఫెక్ట్: భారత వ్యాపారవేత్తలపై అమెరికా కఠిన చర్యలు.. కుటుంబాలతో సహా వీసాలు రద్దు

Fentanyl Effect US Imposes Strict Actions on Indian Businessmen Visas Canceled
  • ఫెంటానిల్ డ్రగ్ రసాయనాల రవాణాలో ప్రమేయం
  • భారత వ్యాపారవేత్తలు, వారి కుటుంబాల వీసాలు రద్దు
  • ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన
  • అమెరికా ప్రయాణానికి అనర్హులుగా ప్రకటించిన యూఎస్
  • మాదకద్రవ్యాల నిరోధంలో భారత్‌తో కలిసి పనిచేస్తున్నామన్న అమెరికా
అమెరికాలో తీవ్రమైన మాదకద్రవ్యాల సంక్షోభానికి కారణమవుతున్న ఫెంటానిల్ అనే డ్రగ్ తయారీకి వాడే రసాయనాలను అక్రమంగా రవాణా చేస్తున్న భారత వ్యాపారవేత్తలపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ కేసులో ప్రమేయమున్న కొందరు భారత వ్యాపారవేత్తలతో పాటు, వారి కుటుంబ సభ్యుల వీసాలను కూడా రద్దు చేసినట్టు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

వీసాలు రద్దు చేయడమే కాకుండా, భవిష్యత్తులో వారు చేసుకునే దరఖాస్తులను కూడా తిరస్కరించనున్నట్లు ఎంబసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో సదరు వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు అమెరికాలో ప్రయాణించడానికి అనర్హులుగా మారారని పేర్కొంది. అయితే, ఈ చర్యలకు గురైన వ్యాపారవేత్తల పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ఫెంటానిల్ ముడి రసాయనాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల ఉన్నతాధికారులు వీసాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు వారిని ప్రత్యేకంగా గుర్తిస్తామని కూడా హెచ్చరించింది.

"అమెరికాకు డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసే వ్యక్తులు, సంస్థలు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారి కుటుంబాలతో సహా అమెరికాలోకి ప్రవేశాన్ని నిరాకరించవచ్చు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో మా నిబద్ధత స్థిరంగా ఉంటుంది" అని ఎంబసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ క్లిష్టమైన సవాలును ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అమెరికా రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. "రెండు దేశాల ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ద్వారానే ఈ సరిహద్దులు దాటిన ముప్పును ఎదుర్కోగలం. మన ప్రజలను ఈ అక్రమ మాదకద్రవ్యాల నుంచి కాపాడుకోగలం" అని పేర్కొంది.

కాగా, హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైన ఫెంటానిల్, అమెరికాలో యువత మరణాలకు ప్రధాన కారణంగా మారింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) నివేదిక ప్రకారం, ఒక్క 2024లోనే ఈ డ్రగ్ కారణంగా 48,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ఫెంటానిల్ సరఫరాను అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. 
Fentanyl
Fentanyl crisis
US India relations
Drug trafficking
Visa cancellation
Indian businessmen
US Embassy Delhi
America
Drug smuggling

More Telugu News