Kollu Ravindra: మద్యం స్కాంలో వాస్తవాలు బయటపెడతాం: కొల్లు రవీంద్ర

Liquor Scam Facts to be Revealed Says Kollu Ravindra
  • గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందన్న మంత్రి కొల్లు రవీంద్ర
  • నాసిరకం మద్యం సరఫరాతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆరోపణ
  • కొత్త మద్యం పాలసీ చాలా పారదర్శకంగా ఉందని వ్యాఖ్య
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని, నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరుపుతోందని, త్వరలోనే అన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.

శాసనమండలిలో బెల్టుషాపులు, నకిలీ మద్యం అమ్మకాలపై జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. మద్యం విషయంలో గత ప్రభుత్వం అంతా మంచి చేసిందని వైసీపీ నేతలు చెప్పడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ‘‘గత ఐదేళ్లలో నాసిరకం మద్యం తాగి ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది, నిజానిజాలు త్వరలో తేలుతాయి’’ అని ఆయన అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మద్యం విధానం అత్యంత పారదర్శకంగా ఉందని మంత్రి తెలిపారు. ‘‘మద్యాన్ని మేం ఎప్పుడూ ఆదాయ వనరుగా చూడలేదు. మా విధానం ఎంత పారదర్శకంగా ఉందంటే, పక్క రాష్ట్రాలు కూడా దానిపై అధ్యయనం చేస్తున్నాయి. మద్యం దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే తొలిసారి జరిమానా, రెండోసారి లైసెన్స్‌ సస్పెండ్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. సరఫరాను పర్యవేక్షించడానికి పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం’’ అని వివరించారు.

నాసిరకం మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, కేసులు నమోదు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో మద్యం కారణంగా మరణించినట్లుగా ఇప్పటివరకు ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన సభకు తెలియజేశారు. 
Kollu Ravindra
Andhra Pradesh
liquor scam
excise minister
YSRCP
Tota Trimurthulu
Sivarami Reddy
fake liquor
SIT investigation
liquor policy

More Telugu News