Ponguleti Srinivasa Reddy: ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి హితవు

Ponguleti Srinivasa Reddy criticizes KTR advises to fix his house first
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చూపాలని బీఆర్ఎస్‌కు సవాల్
  • పదేళ్లలో పేదలకు ఇళ్లు కట్టడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపణ
  • కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కమీషన్లకే పరిమితమయ్యారని విమర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు తన ఇంటిని, పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికిన ఆయన, రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. "నీకు విజన్ ఉందా? మీ నాన్నకు ఉందా? అన్నది తెలుసుకో. మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల నాటికి నువ్వు అమెరికాలో ఉంటావో, ఇండియాలో ఉంటావో కూడా ప్రజలకు సందేహంగా ఉంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గురువారం వరంగల్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 కుటుంబాలకు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శించారు. "ప్రతి సంవత్సరం లక్ష ఇళ్లు కట్టినా, పదేళ్లలో పది లక్షల పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరేది. కానీ గత ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమీషన్లపైనే దృష్టి పెట్టింది తప్ప పేదల గృహ నిర్మాణాన్ని పట్టించుకోలేదు" అని ఆయన ఆరోపించారు. పాము కోరల్లో విషం ఉన్నట్టు, బీఆర్ఎస్ నేతలు ఒళ్లంతా విషం నింపుకుని తిరుగుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను తిరస్కరించారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెబుతారని పొంగులేటి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీపీసీసీ నాయకులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. 
Ponguleti Srinivasa Reddy
KTR
BRS
Congress
Telangana Politics
Warangal
Jubilee Hills
Telangana Elections
Housing Scheme
Kaleshwaram Project

More Telugu News