Salman Ali Agha: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్‌కు కొత్త టెన్షన్.. కెప్టెన్ సీరియస్ వార్నింగ్!

Salman Ali Agha Warns Pakistan Before India Match
  • భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు పాక్ కెప్టెన్ ఆందోళన
  • మధ్య ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యంపై సల్మాన్ అఘా అసంతృప్తి
  • యూఏఈపై గెలిచినా బ్యాటింగ్ తీరు మారలేదన్న వ్యాఖ్యలు
  • ఈ బలహీనతను అధిగమించకపోతే కష్టమని జట్టును హెచ్చరించిన‌ కెప్టెన్
  • ఈ నెల‌ 21న ఆసియా కప్ సూపర్-4లో దాయాదుల‌ పోరు
  • గత మ్యాచ్‌లోని 'హ్యాండ్ షేక్' వివాదం నేపథ్యంలో ఉత్కంఠ
ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా సెప్టెంబర్ 21న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టును బ్యాటింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మధ్య ఓవర్లలో బ్యాటర్లు చేతులెత్తేయడంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ బలహీనతను అధిగమించకపోతే కష్టమని తన జట్టును హెచ్చరించాడు.

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో గెలిచి సూపర్-4కు అర్హత సాధించినప్పటికీ, వారి బ్యాటింగ్ తీరు ఆందోళనకరంగానే ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 9 వికెట్ల నష్టానికి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో షాహీన్ షా ఆఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా సాధ్యమైంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఓపెనర్ సయీమ్ అయూబ్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో ఖాతా తెరవలేదు.

మ్యాచ్ అనంతరం సల్మాన్ అఘా మాట్లాడుతూ... "మేము గెలిచాం కానీ మధ్య ఓవర్లలో మా బ్యాటింగ్ తీరు బాగాలేదు. బౌలర్లు అద్భుతంగా రాణించారు. మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా ఇవ్వలేదు. బ్యాటింగ్ సరిగ్గా చేసి ఉంటే స్కోరు 170-180కి చేరేది" అని అన్నాడు. షాహీన్ ఒక మ్యాచ్ విన్నర్ అని, అతని బ్యాటింగ్ కూడా మెరుగుపడిందని ప్రశంసించాడు. స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టును ఆదుకుంటున్నాడని కొనియాడాడు.

గ్రూప్ స్టేజ్‌లో భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న 'హ్యాండ్ షేక్' వివాదం ఇరుజట్ల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో సూపర్-4 పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. "మేము ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఆడుతున్నట్లు మంచి క్రికెట్ ఆడితే, ఏ జట్టుపైనైనా గెలవగలం" అని స‌ల్మాన్ అఘా ధీమా వ్యక్తం చేశాడు. అయితే, భారత బౌలింగ్ దాడిని తట్టుకోవాలంటే పాక్ బ్యాటర్లు తప్పక రాణించాల్సి ఉంటుంది.


Salman Ali Agha
Pakistan cricket
India vs Pakistan
Asia Cup 2025
Pakistan batting
Shaheen Afridi
Abrar Ahmed
UAE cricket
Super 4
Cricket news

More Telugu News