Yerugu Ambedkar: విద్యుత్ ఏడీఈ అక్రమాస్తుల కేసు.. బినామీ ఇంటి బాత్రూంలో రూ.17 లక్షలు!

Ambedkar Case ACB Seizes 17 Lakhs in Benami House
  • విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ అక్రమాస్తుల కేసులో కొనసాగుతున్న సోదాలు
  • బినామీగా ఉన్న మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో ఏసీబీ తనిఖీలు
  • బాత్రూంలో దాచిన రూ.17 లక్షల నగదు స్వాధీనం
  • రెండు రోజులుగా ఆఫీసుకు రాకుండా పరారీలో రాజేష్ బాబు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన విద్యుత్ శాఖ ఏడీఈ ఏరుగు అంబేద్కర్ కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. అంబేద్కర్‌కు బినామీగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో బుధవారం సాయంత్రం సోదాలు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో నివసిస్తున్న రాజేష్ బాబు నివాసంలో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో భాగంగా బాత్రూంలో ఒక కవర్‌లో దాచి ఉంచిన రూ.17 లక్షల నగదును అధికారులు గుర్తించారు. నగదుతో పాటు కొన్ని కీలకమైన స్థిరాస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సోదాలు జరిగిన సమయంలో రాజేష్ బాబు ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఆయన గత రెండు రోజులుగా విధులకు కూడా హాజరు కావడం లేదని సమాచారం.

మరోవైపు, ప్రధాన నిందితుడైన ఇబ్రహీంబాగ్‌ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంబేద్కర్‌ అక్రమాస్తుల విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఆయన బంధువులు, మరో బినామీ అయిన సతీశ్ ఇళ్లలో జరిపిన సోదాల్లో రూ.2.18 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్‌కు సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న చేవెళ్ల, మొయినాబాద్ వంటి ప్రాంతాలలో కొత్త లేఅవుట్‌లు, ఫామ్‌హౌస్‌లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఈ అధికారులు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మొయినాబాద్‌లో ఏఈగా పనిచేసిన సమయంలో రాజేష్ బాబు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని, అంబేద్కర్‌కు సంబంధించిన మరికొన్ని బ్యాంకు లాకర్లను తెరిచి పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
Yerugu Ambedkar
Ambedkar illegal assets case
ACB raids
Rajesh Babu
Electricity Department
Maredpally
Chevela
Moinabad
Corruption case
Telangana

More Telugu News