IT Employee: నా కింద పనిచేసే జూనియర్లకే నాకన్నా ఎక్కువ జీతం.. టెక్కీ షాకింగ్ పోస్ట్!

Salary Disparity in IT Company Employee Shares Experience
  • జూనియర్లకు తనకన్నా 40% ఎక్కువ జీతమన్న టెకీ
  • రెడిట్‌లో తన గోడు వెళ్లబోసుకున్న ఓ సీనియర్ ఐటీ అనలిస్ట్
  • గత కంపెనీ జీతం ఆధారంగా కొత్త నియామకాల వల్లే ఈ వ్యత్యాసమని వెల్లడి
  • ప్రతిభ ఉన్నా, జీతం అడగకపోతే నష్టపోవాల్సిందేనంటున్న నిపుణులు
  • వేతన వ్యత్యాసంపై ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌‌గా మారిన చర్చ
సాఫ్ట్‌వేర్ రంగంలో విచిత్ర పోకడలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా ఓ భారతీయ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ అనలిస్ట్ తనకు ఎదురైన అలాంటి అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, అది ఇప్పుడు ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తన కింద పనిచేసే ఇద్దరు జూనియర్ ఉద్యోగులకు తనకంటే దాదాపు 30 నుంచి 40 శాతం ఎక్కువ జీతం వస్తోందని తెలుసుకుని ఆయన షాక్‌కు గురయ్యారు.

‘ఇండియన్ వర్క్‌ప్లేస్’ అనే రెడిట్ గ్రూప్‌లో ఆయన తన ఆవేదనను పంచుకున్నారు. తాను ఎక్కువ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ, తన బృందంలోని జూనియర్ల కంటే తక్కువ జీతం తీసుకోవడం అన్యాయంగా ఉందని వాపోయారు. "నేను ఎక్కువ పని చేస్తాను, ఎక్కువ బాధ్యత తీసుకుంటాను. రోజూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటాను. అయినా నా కింద పనిచేసే వాళ్ల కంటే నా జీతం తక్కువ" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితికి కారణం పాత కంపెనీలో ఉన్న జీతమేనని ఆయన వివరించారు. తాను ఉద్యోగంలో చేరినప్పుడు పాత జీతంపై 85 శాతం హైక్ లభించడంతో చాలా సంతోషించానని, అయితే తన జూనియర్లు అంతకుముందు ఎక్కువ జీతాలున్న కంపెనీల నుంచి రావడంతో, వారికి మరింత ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చారని ఆయన గుర్తించారు. ఈ విషయంపై నేరుగా హెచ్‌ఆర్‌తో మాట్లాడితే తనపై నెగటివ్ ముద్ర పడుతుందేమోనని భయపడుతున్నట్లు తెలిపారు.

ఆయన పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు పలు రకాల సలహాలు ఇచ్చారు. ఒకరు ‘మార్కెట్ కరెక్షన్’ కోసం ప్రయత్నించాలని, తన విజయాలను, పనితీరును ఆధారాలుగా చూపి యాజమాన్యాన్ని అడగాలని సూచించారు. "ఈ రోజుల్లో కేవలం కష్టపడి పనిచేస్తే జీతాలు పెరగవు. దానితో పాటు బేరమాడే వ్యూహం లేదా ఉద్యోగం మారే తెగింపు ఉండాలి" అని మరొకరు కామెంట్ చేశారు.

మరికొందరు తమ సొంత అనుభవాలను పంచుకున్నారు. "నేను రూ. 25 వేల జీతానికి మూడు ప్రాజెక్టులు చేస్తుంటే, నా సహోద్యోగి తక్కువ పనితో రూ. 38 వేలు తీసుకుంటున్నాడు. పైగా పైచదువులకు కంపెనీ సాయం కూడా పొందుతున్నాడు. ఇది చాలా నిరుత్సాహానికి గురిచేస్తోంది" అని మరో ఉద్యోగి వాపోయారు. చాలామంది నెటిజన్లు.. ముందుగా వేరే కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ తెచ్చుకుని, ఆ తర్వాతే ప్రస్తుత కంపెనీతో జీతం గురించి చర్చించడం ఉత్తమమని సలహా ఇచ్చారు. మొత్తంగా ఈ చర్చ.. ప్రస్తుత ఐటీ రంగంలో ప్రతిభ కంటే బేరమాడటమే జీతాన్ని నిర్దేశిస్తోందనే వాస్తవాన్ని మరోసారి కళ్లకు కట్టింది.
IT Employee
software engineer
salary disparity
job dissatisfaction
Indian workplace
IT industry
salary negotiation
career advice
employee compensation
market correction

More Telugu News