Ram Gopal Varma: మాజీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు.. రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

RGV Case Filed by Retired IPS Officer Anjana Sinha
  • వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీపై మరో కేసు
  • 'దహనం' వెబ్ సిరీస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు
  • అనుమతి లేకుండా తన పేరు వాడారని అంజనా సిన్హా ఆరోపణ
  • హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
సంచలనాలకు, వివాదాలకు చిరునామాగా నిలిచే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'దహనం' వెబ్ సిరీస్‌కు సంబంధించి వర్మపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే, మావోయిస్టుల నేపథ్యంతో తాను రూపొందించిన 'దహనం' వెబ్ సిరీస్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా పేరును ఆమె అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అంజనా సిన్హా నేరుగా పోలీసులను ఆశ్రయించారు. తన ప్రమేయం లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా వెబ్ సిరీస్‌లో తన పేరును ప్రస్తావించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలను తానే చెప్పినట్లుగా వర్మ చిత్రీకరించారని చెప్పడం కూడా పూర్తిగా అవాస్తవమని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, తన పేరును దుర్వినియోగం చేసినందుకు రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

అంజనా సిన్హా ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన రాయదుర్గం పోలీసులు, రామ్ గోపాల్ వర్మపై ఐదు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఏపీ రాజకీయాలపై సినిమాలు, వ్యాఖ్యలతో పలు వివాదాల్లో చిక్కుకున్న వర్మ, ఇప్పుడు 'దహనం' వెబ్ సిరీస్‌తో మరోసారి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతున్నారు. 
Ram Gopal Varma
RGV
Dahanam web series
Anjana Sinha IPS
Rayadurgam police station
Hyderabad police
Controversy
Telugu cinema news
Crime web series
Retired IPS officer

More Telugu News