Dharmana Prasada Rao: కూటమి పాలన అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు... ఆ ముసుగులో టీడీపీ పాలిస్తోంది: ధర్మాన ప్రసాదరావు

TDP is ruling AP under the guise of alliance says Dharmana Prasada Rao
  • ఏపీలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమే అన్న ధర్మాన
  • రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన లేదని విమర్శ
  • రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్లు అప్పు చేస్తారా? అని మండిపాటు
రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్నది కూటమి పాలన కాదని, అది కేవలం తెలుగుదేశం పార్టీ పాలన మాత్రమేనని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. పాపం అందరికీ పంచాలనే ఉద్దేశంతోనే వారు దీనికి 'కూటమి' అని పేరు పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరగడం లేదని ఆరోపించారు.

"ఒక రాజధాని నిర్మాణం కోసం లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టడం రాజ్యాంగబద్ధ పాలన ఎలా అవుతుంది? ఆ భారాన్ని రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఏళ్ల తరబడి మోయాల్సి వస్తుంది" అని విమర్శించారు. సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచినప్పుడే అది నిజమైన రాజ్యాంగ పాలన అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చెరువులా మారిన రాజధాని ప్రాంతాన్ని ప్రజలకు చూపించకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ధర్మాన ఆరోపించారు.

గత ఐదేళ్లలో ఎన్నడూ రైతులు ఘర్షణ పడిన సంఘటనలు లేవని గుర్తుచేశారు. పేదరికాన్ని రూపుమాపడానికి విద్య ఒక్కటే మార్గమని నమ్మిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తోందని విమర్శించారు. పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విద్యా సంస్కరణలను నిర్వీర్యం చేస్తున్నారని, దీనిపై అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ, వైసీపీ పేదల అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేంత వరకు దళిత సమాజం పోరాడుతుందని స్పష్టం చేశారు. జగన్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు దళితులందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. "గతంలో 'దళిత కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా?' అని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయకత్వాన్ని ఏ దళితుడైనా ఎలా ఆమోదిస్తాడు?" అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. 
Dharmana Prasada Rao
TDP
Andhra Pradesh Politics
Alliance Government
Chandrababu Naidu
YS Rajasekhara Reddy
Sudhakar Babu
YSRCP
రాజధాని నిర్మాణం
పేదరికం

More Telugu News