Savita: త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం: ఏపీ మంత్రి సవిత

AP Minister Savita Announces BC Protection Act Soon
  • సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన బీసీ మంత్రుల భేటీ 
  • బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లకుపైగా కేటాయించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్న మంత్రి సవిత 
  • బీసీలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని వెల్లడి
వెనుకబడిన తరగతుల (బీసీలు) ఆత్మాభిమానాన్ని నిలిపే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాత్మకమైన అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టానికి త్వరలో తుదిరూపం ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. నిన్న రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత అధ్యక్షతన బీసీ మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, ఎన్.ఎం.డి. ఫరూక్ తదితరుల సమక్షంలో ఒక కీలక సమావేశం జరిగింది. అనంతరం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి సవిత, బీసీల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి జరుగుతోందని, ఈ పరంపరను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 2025-26 బడ్జెట్‌లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.47 వేల కోట్లకు పైగా బీసీ సంక్షేమానికి కేటాయించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని తెలిపారు. బీసీలు ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చ జరిగిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాలనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చామని ఆమె తెలిపారు. 
Savita
AP Minister Savita
BC Welfare
Backward Classes Protection Act
Andhra Pradesh
Chandrababu Naidu
BC Reservations
Local Body Elections
BC Welfare Budget

More Telugu News