Chandrababu Naidu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions Begin Today Focus on Key Bills
  • 20 అంశాలపై చర్చకు టీడీపీ ప్రతిపాదన! 
  • ఆరు అర్డినెన్స్ స్థానంలో బిల్లులు
  • నేడు మంత్రిమండలి సమావేశం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. వారం లేదా పది రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఇటీవలే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన ఎన్డీయే కూటమి ఈ సమావేశాలకు ఉత్సాహంగా సన్నద్ధమవుతోంది. అయితే, వైకాపా మాత్రం శాసనసభకు దూరంగా ఉండే నిర్ణయాన్ని కొనసాగిస్తోంది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి హాజరవుతామన్న పట్టుదలతోనే వైకాపా ఉంది. అయితే, శాసనమండలిలో మాత్రం వైకాపా సభ్యులు హాజరవుతారు.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం ఆరు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనుంది. వాటిలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణలు, ఏపీ మోటారు వాహనాల పన్నుల బిల్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు, అలాగే ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ బిల్లు వంటి కీలక అంశాలు ఉండనున్నాయి. ప్రభుత్వ విధానాల అమలు, కొత్త పెట్టుబడుల ప్రోత్సాహం, డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, సూపర్ - 6, పి - 4, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి వంటి 20 అంశాలపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది.

ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం ప్రభుత్వం పలు పత్రాలను సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం బీఏసీ సమావేశంలో సభలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండాలో ఏ అంశాలు ఉండాలి అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. శాసనమండలి బీఏసీ సమావేశం రేపు జరగనుంది.

కాగా, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బిల్లులపై చర్చించి, మంత్రిమండలి ఆమోదం తెలపడానికి ఈరోజు మధ్యాహ్నం మంత్రి మండలి సమావేశం జరగనుంది. మంత్రులు సభలో ఎలా స్పందించాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు. 
Chandrababu Naidu
AP Assembly
Andhra Pradesh Assembly
AP Assembly Sessions
YSRCP
AP Bills
AP Government
Super Six
DSC Recruitment
India International University of Legal Education and Research Bill

More Telugu News