Amaravati Farmers: అమరావతి రైతులకు 'పట్టా' భరోసా.. అసైన్డ్ కష్టాలకు చెక్

Amaravati farmers assigned land issues resolved by government
  • రాజధాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట
  • అసైన్డ్ భూములిచ్చిన రైతుల ప్లాట్లకు 'పట్టా' హోదా
  • యాజమాన్య ధ్రువపత్రాల నుంచి 'అసైన్డ్' పదం తొలగింపు
  • ధర రావడం లేదన్న రైతుల ఆవేదనపై ప్రభుత్వం స్పందన
  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో కీలక జీఓ జారీ
  • ల్యాండ్ పూలింగ్ చట్టంలో సవరణలు చేసిన అధికారులు
రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో తమ అసైన్డ్ భూములను ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం చూపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ కింద వారికి కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్ల యాజమాన్య ధ్రువపత్రాల నుంచి ‘అసైన్డ్’ అనే పదాన్ని తొలగిస్తూ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆ ప్లాట్లను ‘పట్టా భూమి’గా పరిగణించనున్నారు.

ఏళ్ల తరబడి రైతుల ఆవేదన
గతంలో ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా తమ అసైన్డ్ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు తిరిగి కేటాయించిన ప్లాట్ల ఓనర్‌షిప్ సర్టిఫికెట్లలో ‘అసైన్డ్’ అనే ముద్ర ఉండేది. ఈ కారణంగా ఆ ప్లాట్లను అమ్ముకోవడానికి లేదా ఇతర లావాదేవీలు జరపడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ప్లాట్లకు మార్కెట్లో సరైన ధర లభించక, చాలా తక్కువ మొత్తానికే విక్రయించుకోవాల్సి వస్తోందని రైతులు చాలాకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు పలుమార్లు సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రాలు కూడా సమర్పించారు.

సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ఉత్తర్వులు
రైతుల ఇబ్బందులను గమనించిన సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, యాజమాన్య ధ్రువపత్రాల నుంచి ‘అసైన్డ్’ పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘పట్టా భూమి’ అని చేర్చాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ల్యాండ్ పూలింగ్ చట్టంలోని రూల్ నంబర్ 11(4) క్లాజ్‌ను సవరిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ జీఓ ఎం.ఎస్. నంబర్ 187ను విడుదల చేశారు. ఈ నిర్ణయంతో రాజధాని రైతులకు భారీ ఊరట లభించగా, వారి ప్లాట్లకు ఇకపై పూర్తిస్థాయి పట్టా భూమిగా గుర్తింపు లభించనుంది.
Amaravati Farmers
Chandrababu
Land pooling
Assigned lands
Patta lands
CRDA
Andhra Pradesh
Land ownership
Suresh Kumar
Land transactions

More Telugu News