Stree Shakti Scheme: స్త్రీ శక్తి పథకం సక్సెస్.. నెల రోజుల్లో రికార్డు

Stree Shakti Scheme Records Success in Andhra Pradesh First Month
  • ఉమ్మడి కృష్ణాలో నెల రోజుల్లో 78 లక్షల మంది మహిళల ఉచిత ప్రయాణం
  • ప్రభుత్వం భరించిన రాయితీ విలువ రూ. 23 కోట్లకు పైనే
  • ఆర్టీసీ బస్సుల్లో 80 శాతానికి చేరిన మహిళా ప్రయాణికులు
  • మహిళల రద్దీతో బస్సులెక్కలేకపోతున్న పురుషులు
  • బస్సుల్లో పురుషులకు 50% సీట్లు రిజర్వ్ చేయాలంటూ కొత్త డిమాండ్
  • ఎన్టీఆర్ జిల్లాలో 51 లక్షలు, కృష్ణాలో 26 లక్షల మంది ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం తొలి నెలలోనే అద్భుతమైన స్పందన అందుకుంది. అయితే, ఈ పథకం విజయవంతం కావడం ఒక కొత్త చర్చకు దారి తీస్తోంది. బస్సుల్లో మహిళల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో, పురుషులకు కూడా సీట్లు రిజర్వ్ చేయాలనే డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

గత ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం కింద సెప్టెంబర్ 15 నాటికి, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏకంగా 78,45,962 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 23.69 కోట్లను రాయితీగా భరించినట్లు ఆర్టీసీ అధికారులు గణాంకాలను విడుదల చేశారు.

ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఎన్టీఆర్ జిల్లాలో 51,57,863 మంది మహిళలు ప్రయాణించగా, వారి టికెట్ల కోసం ప్రభుత్వం రూ. 14.37 కోట్లు చెల్లించింది. అదేవిధంగా, కృష్ణా జిల్లాలో 26,88,099 మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగా, రూ. 9.31 కోట్ల రాయితీని ప్రభుత్వం భరించింది.

ఈ పథకం ప్రభావంతో ఉద్యోగినులు, విద్యార్థినులు, చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ వంటి పట్టణాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ 80 శాతానికి చేరింది. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.

పురుషులకు సీట్ల రిజర్వేషన్ డిమాండ్!
మహిళల రద్దీ పెరగడంతో బస్సుల్లో ప్రయాణం పురుషులకు ఇబ్బందికరంగా మారింది. చాలామంది నిల్చోనే ప్రయాణించాల్సి వస్తోందని, వీరిలో వృద్ధులు కూడా ఉంటున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య ఒక కొత్త వాదనను ముందుకు తెచ్చారు. బస్సుల్లో మహిళలకు, పురుషులకు చెరి సగం సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ప్రస్తుతం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది.


Stree Shakti Scheme
APSRTC
free bus travel
Andhra Pradesh
women bus travel
bus reservation
Narne Venkata Subbaiah
Krishna district
Vijayawada
Machilipatnam

More Telugu News