Retired Doctor: డిజిటల్ అరెస్ట్ భయం... గుండెపోటుతో డాక్టర్ మృతి

Retired Doctor Dies of Heart Attack After Digital Arrest Scam in Hyderabad
  • డిజిటల్ అరెస్టు అంటూ విశ్రాంత వైద్యురాలికి సైబర్ నేరగాడి బెదిరింపులు
  • హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
డిజిటల్ అరెస్టులు ఉండవని, ప్రజలు భయపడవద్దని పోలీసు శాఖ అవగాహన కల్పిస్తున్నా, కొందరు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ విశ్రాంత వైద్యురాలు సైబర్ నేరగాళ్ల బారిన పడి మరణించిన ఘటన వెలుగుచూసింది.

డిజిటల్ అరెస్టు పేరుతో మూడు రోజుల పాటు సైబర్ నేరగాళ్లు వేధించడంతో హైదరాబాద్‌కు చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ వైద్యురాలు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నిన్న వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌కు చెందిన ఈ సీనియర్ వైద్యురాలు గతంలో చీఫ్ సీనియర్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. సెప్టెంబర్ 5న, సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించి, బెంగళూరు పోలీసులుగా నమ్మించారు. ఆమె ఆధార్ కార్డును మానవ అక్రమ రవాణా కేసులో వినియోగించారని బెదిరించారు.

నకిలీ అధికార పత్రాలు, వీడియో కాల్స్ ద్వారా బెదిరింపులు

సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు ఆమెకు ప్రతిరోజూ వీడియో కాల్స్ చేస్తూ, సుప్రీంకోర్టు, ఈడీ, ఆర్బీఐ, కర్ణాటక పోలీస్ విభాగాల పేరుతో నకిలీ అరెస్ట్ వారెంట్లు చూపించి భయపెట్టారు. డిజిటల్ అరెస్టు చేశామని చెప్పి, బ్యాంకు వివరాలు అడిగి, దర్యాప్తు అవసరమని ఆమెను మానసికంగా వేధించారు.

రూ.6.6 లక్షలు మోసగించి... గుండెపోటుకు గురై మృతి

ఈ క్రమంలో ఆమె భయంతో తన పెన్షన్ ఖాతా నుంచి రూ.6.6 లక్షలను విడతల వారీగా నేరగాళ్లకు బదిలీ చేశారు. సెప్టెంబర్ 8న తెల్లవారుజామున తీవ్ర ఆందోళనకు గురైన ఆమెకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.

మరణించినప్పటికీ సైబర్ నేరగాళ్ల నుంచి సందేశాలు

ఆమె మరణించిన తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్‌కు సందేశాలు పంపుతూనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఫోన్‌లోని కాల్ లాగ్స్, మెసేజ్‌లను పరిశీలించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజలకు హెచ్చరిక:

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే వీడియో కాల్స్‌ను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 
Retired Doctor
Cyber Crime Hyderabad
Digital Arrest Scam
Heart Attack Death
Cyber Fraud
Online Scam
Hyderabad News
Police Investigation
Fake Police
Financial Fraud

More Telugu News