Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేశ్.. నేపాల్ నుంచి మనవాళ్లందరూ వచ్చేశారు!

Nara Lokesh Keeps His Word All AP Pilgrims Return From Nepal
  • నేపాల్ యాత్రికులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చిన మంత్రి లోకేష్
  • మొత్తం 361 మంది ఏపీ వాసులు క్షేమంగా వాపస్
  • నేడు హైదరాబాద్‌కు చివరి 86 మంది సభ్యుల బృందం
  • అమరావతి వార్ రూమ్ నుంచి సహాయక చర్యల పర్యవేక్షణ
  • విజయవంతంగా ముగిసిన 'ఆపరేషన్ నేపాల్ రెస్క్యూ'
  • ఢిల్లీలోని ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ మూసివేత
నేపాల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యాత్రికులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించే ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఈ సహాయక చర్యలను ముందుండి నడిపించారు. గతంలో ఉత్తరాఖండ్ వరదల సమయంలో చంద్రబాబు చూపిన చొరవనే స్ఫూర్తిగా తీసుకుని, చివరి తెలుగు వ్యక్తిని రాష్ట్రానికి చేర్చే వరకు లోకేశ్ విశ్రమించలేదు. మొత్తం 361 మంది యాత్రికులు క్షేమంగా వారివారి స్వస్థలాలకు చేరడంతో 'ఆపరేషన్ నేపాల్ రెస్క్యూ' సంపూర్ణమైంది.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

మానససరోవర్ యాత్రకు వెళ్లి నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రికుల సమాచారం అందుకున్న వెంటనే మంత్రి లోకేశ్ రంగంలోకి దిగారు. ఇందుకోసం తన అనంతపురం పర్యటనను సైతం రద్దు చేసుకుని, ఈ నెల 10, 11 తేదీల్లో సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీ) కేంద్రంలో ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రతి రెండు గంటలకోసారి యాత్రికుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ, వీడియో కాల్స్ ద్వారా వారితో మాట్లాడి ధైర్యం నూరిపోశారు. వారిని సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వానిదని భరోసా కల్పించారు.

దశలవారీగా యాత్రికుల తరలింపు

మంత్రి లోకేశ్ పర్యవేక్షణలో, యాత్రికులను దశలవారీగా రాష్ట్రానికి తరలించారు. తొలుత 275 మందిని ప్రత్యేక విమానాల్లో విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నంద్యాల వంటి ప్రాంతాలకు సురక్షితంగా చేర్చారు. ఆయా విమానాశ్రయాలకు చేరుకున్న యాత్రికులకు స్వాగతం పలికి, వారిని ఇళ్లకు చేర్చే బాధ్యతను స్థానిక కూటమి ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో వారు అవసరమైన రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించారు. 

తాజాగా, చివరి బృందంలోని 86 మంది యాత్రికులు బుధవారం ఖాట్మండు నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ చేరుకోవడంతో ఈ ఆపరేషన్ ముగిసింది. నేపాల్‌లో ఇక ఏపీకి చెందిన యాత్రికులు ఎవరూ లేరని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత, ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను మూసివేశారు. "చివరి వ్యక్తిని రక్షించే వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది" అని ఇచ్చిన మాటను లోకేశ్ నిలబెట్టుకున్నారు. తమను సురక్షితంగా కాపాడినందుకు రాష్ట్రానికి తిరిగివచ్చిన యాత్రికులు మంత్రి లోకేశ్ కు, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Nara Lokesh
Nepal
Andhra Pradesh
Yatra
AP Bhavan
stranded pilgrims
rescue operation
Uttarakhand floods
Indian Embassy Nepal
Manasa Sarovar

More Telugu News