Elon Musk: మస్క్ కంపెనీలో భారీ కోతలు.. 500 మందిని తీసేసి, 20 ఏళ్ల విద్యార్థికి కీలక బాధ్యతలు!

Elon Musks xAI Cuts 500 Hires 20 Year Old as Head
  • 1500 నుంచి 900కి తగ్గిన డేటా యానోటేషన్ టీమ్ సిబ్బంది
  • కోతలుండవని హామీ ఇచ్చిన గంటల్లోనే 100 మందికి పైగా ఉద్వాసన
  • కీలకమైన గ్రోక్ AI టీమ్‌కు 20 ఏళ్ల విద్యార్థి డియాగో పాసినీకి నాయకత్వం
  • పాసినీ అర్హతను ప్రశ్నించిన ఉద్యోగుల స్లాక్ ఖాతాలు డీయాక్టివేట్
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ xAIలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఒకేసారి 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన యాజమాన్యం, కేవలం 20 ఏళ్ల వయసున్న యూనివర్సిటీ విద్యార్థికి కీలకమైన విభాగానికి బాధ్యతలు అప్పగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కంపెనీకి చెందిన ప్రతిష్టాత్మక 'గ్రోక్' ఏఐ చాట్‌బాట్‌కు శిక్షణ ఇచ్చే డేటా యానోటేషన్ బృందంలో ఈ మార్పులు జరిగాయి.

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం, సెప్టెంబర్ నెలలో పలు విడతల్లో ఈ భారీ తొలగింపులు జరిగాయి. ఈ కోతలకు ముందు సుమారు 1,500 మంది సిబ్బందితో పనిచేసిన ఈ బృందం, ఇప్పుడు 900 మందికి పరిమితమైంది. గత వారం తొమ్మిది మంది సీనియర్ ఉద్యోగుల స్లాక్ ఖాతాలను కూడా డీయాక్టివేట్ చేశారు. సెప్టెంబర్ 15న జరిగిన ఆల్-హ్యాండ్స్ మీటింగ్‌లో ఇకపై తొలగింపులు ఉండవని యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే, ఆ హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే మరో 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించడం గమనార్హం.

ఈ తొలగింపుల అనంతరం డేటా యానోటేషన్ బృందానికి పెన్సిల్వేనియా యూనివర్సిటీ విద్యార్థి అయిన 20 ఏళ్ల డియాగో పాసినీని హెడ్‌గా నియమించారు. పాసినీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనితీరును అంచనా వేయడానికి కొత్త పద్ధతులను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఉద్యోగులతో వన్-టు-వన్ సమావేశాలు నిర్వహించి, వారి పాత్రల ఆవశ్యకతను సమర్థించుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. కొన్ని ప్రత్యేక పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను కొనసాగించాలా వద్దా అని నిర్ణయిస్తున్నారు.

కేవలం 8 నెలల క్రితం, 2023లో హైస్కూల్ పూర్తి చేసిన వెంటనే పాసినీ xAIలో చేరారు. కంపెనీ నిర్వహించిన హ్యాకథాన్‌లో విజేతగా నిలిచి మస్క్ దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ చదువుతున్న ఆయన, ఉద్యోగం కోసం యూనివర్సిటీ నుంచి 'లీవ్' తీసుకున్నారు. అంతకుముందు పాసినీకి నాయకత్వం వహించిన వ్యక్తి టెస్లా ఆటోపైలట్ టీమ్‌ను పదేళ్లకు పైగా నడిపిన అనుభవజ్ఞుడు. మస్క్ కంపెనీలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన తర్వాత, సెప్టెంబర్ ఆరంభంలో ఎలాన్ మస్క్ స్వయంగా అతడిని ఎక్స్ లో ఫాలో అవడం ప్రారంభించారు. కంపెనీ స్లాక్ ఛానెళ్లలో పాసినీ అర్హతలపై సందేహాలు వ్యక్తం చేసిన ఇద్దరు ఉద్యోగుల ఖాతాలను కొన్ని గంటల్లోనే డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. ఈ తాజా మార్పులు, తొలగింపులపై xAI యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు
Elon Musk
xAI
Grok AI
Diego Passini
Artificial Intelligence
Data Annotation
Layoffs
Business Insider
AI Chatbot
Pennsylvania University

More Telugu News