Komatireddy Raj Gopal Reddy: నిరుద్యోగులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 Komatireddy Raj Gopal Reddy Supports Unemployed Youth
  • ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత డిమాండ్లు
  • నిరుద్యోగులకు అండగా ఉంటానన్న రాజగోపాల్ రెడ్డి
  • నిరుద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్లకు మద్దతు పలుకుతున్నానని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

నిరుద్యోగుల ఆందోళన సరైనదేనని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి, వారికి దారి చూపి, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. అమరవీరుల సాక్షిగా తాను యువతకు అండగా నిలుస్తానని, వారి సమస్యలు వినడానికి తానే స్వయంగా వస్తానని భరోసా ఇచ్చారు. నిరుద్యోగుల నిరసనలకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో యువత పోషించిన పాత్రను ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలతో పాటు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని, ఆ స్ఫూర్తితోనే యువతకు న్యాయం జరగాలని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 
Komatireddy Raj Gopal Reddy
Telangana jobs
Unemployment Telangana
Congress MLA
Revanth Reddy
Group 1 exams
Job recruitment Telangana
BRS government
Sonia Gandhi

More Telugu News