Unnikammad: వృద్ధుడి ఇంట్లో ఆయుధాల గుట్ట.. షాకైన పోలీసులు!

Kerala Man Unnikammad Arrested After Weapon Stockpile Found in Home
  • కేరళలో 60 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో భారీగా ఆయుధాలు
  • మలప్పురం జిల్లాలో వెలుగులోకి వచ్చిన సంచలన ఘటన
  • సోదాల్లో 20 ఎయిర్ గన్‌లు, 3 రైఫిల్స్ స్వాధీనం
  • వందల సంఖ్యలో బుల్లెట్లు, పెల్లెట్ బాక్సులు కూడా లభ్యం
  • ఉన్నికమద్ అనే వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేరళలో ఓ వృద్ధుడి నివాసంలో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి బయటపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అది ఇల్లా లేక ఆయుధశాలా? అని ఆశ్చర్యపోయేలా అక్కడ పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించాయి. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళితే, మలప్పురం జిల్లాకు చెందిన ఉన్నికమద్ (60) అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా ఆయుధాలు నిల్వ ఉంచినట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో వెంటనే అతడి ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులే నివ్వెరపోయేలా పెద్ద సంఖ్యలో ఆయుధాలు బయటపడ్డాయి.

అతడి ఇంటి నుంచి 20 ఎయిర్ గన్‌లు, 3 రైఫిల్స్‌తో పాటు 200 బుల్లెట్లు, 40 పెల్లెట్ బాక్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఉన్నికమద్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇంత భారీ మొత్తంలో ఆయుధాలను ఆయన ఎక్కడి నుంచి సేకరించారు? వీటిని విక్రయించేందుకు నిల్వ ఉంచారా? లేక వ్యక్తిగత అవసరాల కోసం దాచారా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ఏమైనా పెద్ద ముఠా హస్తం ఉందా? అనే దిశగా కూడా విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Unnikammad
Kerala
Malappuram
weapons
air guns
rifles
bullets
ammunition
police raid
illegal weapons

More Telugu News