AP Govt: బెల్ట్ షాపులకు చెక్.. మద్యం దుకాణాల్లో 100 శాతం డిజిటల్ చెల్లింపులు: సీఎం చంద్రబాబు ఆదేశాలు

AP CM Chandrababu focuses on digital payments to curb belt shops
  • నగదు లావాదేవీలతోనే బెల్ట్ షాపులు వస్తున్నాయని సీఎం అభిప్రాయం
  • డిజిటల్ పేమెంట్స్ అమలు చేసే షాపులకే భవిష్యత్తులో ప్రాధాన్యం
  • బార్ల ఏర్పాటులో జాప్యం, ధరల వ్యత్యాసంపై అధికారుల నుంచి వివరాల సేకరణ
  • ఎర్రచందనం విలువ పెంచి ఆదాయం రాబట్టాలని అధికారులకు సూచన
రాష్ట్రంలో బెల్ట్ షాపుల వ్యవస్థకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని మద్యం దుకాణాల్లో 100 శాతం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నగదు లావాదేవీల వల్లే బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆదాయార్జన శాఖలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించిన సీఎం, మద్యం అమ్మకాల విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని కచ్చితంగా అమలు చేసే దుకాణాలకే భవిష్యత్తు కేటాయింపుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

 ఈ సందర్భంగా రాష్ట్రంలో బార్ల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై కూడా అధికారులను ఆరా తీశారు. మద్యం దుకాణాలతో పోలిస్తే బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16 శాతం అధికంగా ఉండటమే ప్రధాన సమస్య అని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. మొదట పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చి, ఆ తర్వాత బార్ల ఏర్పాటుకు వెళ్లడం వల్ల కూడా సమస్యలు తలెత్తాయని కొందరు అధికారులు వివరించారు. దీని వెనుక ఉన్న కారణాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని సీఎం సూచించారు.

సమావేశంలో ఎర్రచందనం ద్వారా రాష్ట్రానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన ఎర్రచందనాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. ఎర్రచందనాన్ని నేరుగా అమ్మే బదులు, తిరుపతి డిపోలోనే బొమ్మలు వంటివి తయారు చేసి విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని సూచించారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధికి అనుగుణంగా ప్రభుత్వ రాబడి కూడా పెరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని, తదుపరి సమావేశం నాటికి స్పష్టమైన ఫలితాలు చూపించాలని ఆయన ఆదేశించారు.
AP Govt
Chandrababu Naidu
Andhra Pradesh
liquor shops
digital payments
belt shops
red sandalwood
GSDP
revenue generation
bar licenses
state income

More Telugu News