Amrit Abhijat: రెండుసార్లు కరిస్తే.. వీధి కుక్కలకు జీవిత ఖైదు!

Uttar Pradesh Government New Rules for Stray Dog Attacks
  • యూపీలో వీధి కుక్కలపై సర్కార్ కఠిన నిబంధనలు
  • రెచ్చగొట్టకుండా కరిస్తే 10 రోజుల పాటు పరిశీలన
  • రెండోసారి దాడి చేస్తే జీవితాంతం షెల్టర్‌కే పరిమితం
  • నిజ నిర్ధారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు
  • షరతులతో దత్తతకు అనుమతి, బయట వదిలితే చర్యలు
ఉత్తరప్రదేశ్‌లో వీధి కుక్కల విషయంలో యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కారణం లేకుండా మనుషులపై దాడి చేసే కుక్కల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఎవరైనా రెచ్చగొట్టకుండా ఒకసారి కరిచిన కుక్కను పది రోజుల పాటు పరిశీలనలో ఉంచి, అదే కుక్క రెండోసారి కూడా దాడి చేస్తే జీవితాంతం యానిమల్ సెంటర్‌లోనే నిర్బంధించాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం వీధి కుక్క కరిచిన తర్వాత ఎవరైనా యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ సంఘటనపై అధికారులు విచారణ జరుపుతారు. వెంటనే ఆ కుక్కను సమీపంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రానికి తరలిస్తారు.

ఈ ప్రక్రియపై ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ పశువైద్యాధికారి డాక్టర్ బిజయ్ అమృత్ రాజ్ మాట్లాడుతూ "ఏబీసీ కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత కుక్కకు స్టెరిలైజేషన్ చేయనట్లయితే, ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. దానిని 10 రోజుల పాటు పరిశీలనలో ఉంచి ప్రవర్తనను గమనిస్తాం. విడుదల చేసే ముందు దానికి ఒక మైక్రోచిప్ అమరుస్తాం. దాని ద్వారా కుక్క వివరాలు, అది ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు" అని వివరించారు.

అదే కుక్క రెచ్చగొట్టకుండా రెండోసారి మనిషిపై దాడి చేస్తే దానిని జీవితాంతం కేంద్రంలోనే ఉంచుతారు. అయితే దాడికి రెచ్చగొట్టే చర్యలు జరిగాయా? లేదా? అనే అంశాన్ని నిర్ధారించడానికి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో స్థానిక పశువైద్యుడు, జంతువుల ప్రవర్తనపై అవగాహన ఉన్న నిపుణుడు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. "ఎవరైనా రాయి విసిరిన తర్వాత కుక్క కరిస్తే, దానిని రెచ్చగొట్టినట్టుగానే పరిగణిస్తారు" అని అధికారులు స్పష్టం చేశారు.

ఇలా నిర్బంధంలో ఉన్న కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. కానీ, వారు తమ పూర్తి వివరాలు అందించి, ఆ కుక్కను మళ్లీ వీధుల్లోకి వదిలిపెట్టబోమని అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ దత్తత తీసుకున్న వారు కుక్కను బయట వదిలేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Amrit Abhijat
Uttar Pradesh
stray dogs
dog bite
animal birth control
ABC center
dog sterilization
anti rabies vaccine
animal shelter
dog adoption

More Telugu News