TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అంగప్రదక్షిణ టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం

TTD Announces Key Changes to Angapradakshinam Token Allotment
  • 'ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్' విధానానికి స్వస్తి
  • ఇకపై ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా టోకెన్ల కేటాయింపు
  • ఆర్జిత సేవల లక్కీ డిప్‌ జాబితాలో అంగప్రదక్షిణం
  • డిసెంబర్ కోటాకు సెప్టెంబర్ 18 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
  • ఒకసారి పొందిన వారు 180 రోజుల తర్వాతే మళ్లీ అర్హులు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. శ్రీవారి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అనుసరిస్తున్న 'ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్' పద్ధతిని రద్దు చేసి, ఇకపై ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా టోకెన్లను కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది.

ఇప్పటికే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవలకు టీటీడీ ఆన్‌లైన్ లక్కీ డిప్ విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకే అంగప్రదక్షిణ సేవను కూడా చేర్చింది. ఇకపై భక్తులు మూడు నెలల ముందుగానే ఈ లక్కీ డిప్ కోసం ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కొత్త విధానం ప్రకారం, డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోసం భక్తులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. లక్కీ డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను వెల్లడించి, వారికి టోకెన్లను కేటాయిస్తారు. శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో 750 టోకెన్లు, శనివారం నాడు 500 టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో పాటు మరో కీలక నిబంధనను కూడా టీటీడీ అమలులోకి తెచ్చింది. గతంలో ఒకసారి అంగప్రదక్షిణ సేవలో పాల్గొన్న భక్తులు మళ్లీ 90 రోజుల తర్వాతే బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే, ఎక్కువ మంది భక్తులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ గడువును 180 రోజులకు (6 నెలలకు) పెంచినట్లు ప్రకటించింది. భక్తులు ఈ మార్పులను గమనించి, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.


TTD
Tirumala
Tirumala Tirupati Devasthanams
Angapradakshinam
Lucky Dip
Online Booking
Token Allotment
Pilgrims
Srivari Temple

More Telugu News