Chandrababu Naidu: అమరావతి ఐకానిక్ బ్రిడ్జి మోడల్ ఇదే!

Chandrababu Naidu Finalizes Amaravati Iconic Bridge Design
  • ఐకానిక్ వంతెన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు
  • ఓటింగ్ లో ఎక్కువ మంది మొగ్గుచూపిన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం
  • కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ కు అత్యధిక ఓట్లు
రాజధాని అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా కేబుల్ వంతెన నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. సుమారు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రతిష్ఠాత్మక వంతెన నమూనాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. వంతెన నిర్మాణానికి సంబంధించి ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజా ఓటింగ్ నిర్వహించగా, అందులో ఎక్కువ ఓట్లు పొందిన రెండో నమూనా ఎంపికైంది.

కూచిపూడి నృత్య భంగిమలో రూపకల్పన

ఈ వంతెన రూపకల్పనలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది కూచిపూడి నృత్య కళను ప్రతిబింబించే ‘స్వస్తిక హస్త’ ఆకృతిని పోలి ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో ఇది ఆకర్షణీయంగా రూపొందించబడుతోంది. ఈ ప్రాజెక్టు యొక్క సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) నిప్పన్ కోయి లిమిటెడ్ సంస్థ సిద్ధం చేసింది.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వంతెనను ఆరు లైన్లుగా నిర్మిస్తారు. రెండు వైపులా కాలిబాటలు ఉంటాయి. అమరావతిలోని రాయపూడి నుండి కృష్ణా నదికి అవతల విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి (NH 65) వద్ద ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు వరకు 5.22 కి.మీ పొడవునా కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.

ప్రస్తుతం జాతీయ రహదారి 65 నుంచి అమరావతికి రావాలంటే దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గం రద్దీ సమయాల్లో వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఈ ప్రతిష్ఠాత్మక వంతెన రాకతో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయి. ఇకపై మూలపాడు నుంచి కేవలం 5 కి.మీ. దూరంలోనే అమరావతికి చేరుకోవచ్చు.

ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్‌తో అనుసంధానం

ఎన్‌హెచ్-65 వద్ద వంతెన ముగింపులో ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు. ఇది వాహనదారులు హైదరాబాద్ వైపు, విజయవాడ వైపు సులభంగా మలుపు తిరగడానికి అనువుగా ఉంటుంది.

2019లో టీడీపీ ప్రభుత్వం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రతిష్ఠాత్మక వంతెన నిర్మాణానికి రూ.1,387 కోట్లతో శంకుస్థాపన చేసింది. అయితే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్థలం మార్చి పునఃప్రారంభించింది. ఇప్పుడు ఇది అమరావతి అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలువనుంది.

ఈ వంతెన నిర్మాణం పూర్తయితే అమరావతికి ఒక నూతన గుర్తింపు రావడం ఖాయం. శిల్పకళ, సాంకేతికత, సంస్కృతి - ఈ మూడింటి సమ్మేళనంగా నిలిచే ఈ వంతెన రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. 
Chandrababu Naidu
Amaravati
Iconic Bridge
Cable Bridge
Krishna River
Vijayawada
Andhra Pradesh
Nippon Koei
Kuchipudi
Trumpet Interchange

More Telugu News