Nara Lokesh: నేడు లండన్‌లో 150 మంది సీఈఓలతో మంత్రి నారా లోకేశ్ రోడ్ షో

Nara Lokesh Road Show with 150 CEOs in London
  • లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఇన్వెస్టర్స్ రోడ్ షో
  • విశాఖ పార్టనర్‌షిప్ సమ్మిట్‌-2025కు గ్లోబల్ లీడర్లకు ఆహ్వానం
  • ఏపీలో పెట్టుబడి అనుకూల విధానాలను వివరించనున్న మంత్రి
  • గత 15 నెలల్లో వచ్చిన రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రస్తావన
  • హిందూజా, రోల్స్ రాయిస్ వంటి దిగ్గజ సంస్థలతో ప్రత్యేక భేటీలు
  • రోడ్ షోకు హాజరుకానున్న 150 మందికి పైగా గ్లోబల్ కంపెనీల సీఈఓలు
ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం నాడు లండన్‌లో పారిశ్రామికవేత్తలతో ఉన్నతస్థాయి రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న "పార్టనర్‌షిప్ సమ్మిట్-2025"కు ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆహ్వానించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.

లండన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు ఈ రోడ్ షో ప్రారంభమవుతుంది. ఈ కీలక సమావేశంలో యూకే డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం అధ్యక్షుడు హర్షూల్ అస్నానీ, ఐసీఐసీఐ బ్యాంకు యూకే సీఈఓ రాఘవ్ సింఘాల్, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ అభిషిక్త్ కిశోర్ వంటి ప్రముఖులు పాల్గొంటారు. వీరితో పాటు గ్లోబల్ ఫండ్స్, తయారీ, సేవా రంగాలకు చెందిన సుమారు 150 మంది సీఈఓలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసిన తీరును (స్పీడ్ ఆఫ్ డూయింగ్), పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న విధానాలను వివరించనున్నారు. గత 15 నెలల్లో రాష్ట్రానికి రూ.10,06,799 కోట్ల విలువైన 122 భారీ ప్రాజెక్టులు వచ్చాయని, పరిశ్రమల కోసం లక్ష ఎకరాలతో ఇండస్ట్రియల్ క్లస్టర్లను సిద్ధం చేశామని ఆయన తెలియజేస్తారు. ఈ పెట్టుబడులను రాబోయే ఏడాదిలో రెట్టింపు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేయనున్నారు.

రోడ్ షోలో భాగంగా మంత్రి లోకేశ్ ఏపీలోని పెట్టుబడి అవకాశాలపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. హిందూజా, రోల్స్ రాయిస్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, ఆధునిక తయారీ రంగాల్లో ఉన్న అవకాశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తారు. ఎరిక్సన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సైయంట్, లండన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రేడ్, టెక్నాలజీ, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై చర్చించనున్నారు.
Nara Lokesh
Andhra Pradesh
Partnership Summit 2025
Visakhapatnam
AP investments
UK investments
Industrial development
AP industries
Make in AP
AP government

More Telugu News