BR Naidu: ఏపీ వ్యాప్తంగా వెయ్యి ఆలయాలు నిర్మిస్తున్నాం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

TTD to Build 1000 Temples Across AP Says BR Naidu
  • ప్రతి నియోజకవర్గంలో ఆరు వరకు ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయం
  • బ్రహ్మోత్సవాలను పరిశీలించనున్న ఇస్రో
  • 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణను ఈసారి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాకు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించినట్లు బీఆర్‌ నాయుడు తెలిపారు. మతమార్పిడులను అరికట్టే లక్ష్యంతో శ్రీవాణి ట్రస్టుకు వచ్చే నిధులను ఈ ఆలయాల నిర్మాణానికి వినియోగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు ఆలయాల వరకు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించినట్లు ఛైర్మన్ తెలిపారు. ఈనెల 23న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా, 24 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. సెప్టెంబర్ 24న మీన లగ్నంలో ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పది రోజుల పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బీఆర్‌ నాయుడు ప్రకటించారు. ఈనెల 28న జరిగే శ్రీవారి గరుడ సేవకు సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామన్నారు. భక్తుల రద్దీలో చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు, వారి భద్రత కోసం తొలిసారిగా జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.

అంతకుముందు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర బోర్డు సభ్యులతో కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌-2025ను ఆవిష్కరించారు. 
BR Naidu
TTD
Tirumala
Brahmotsavam
Chandrababu Naidu
Srivari Brahmotsavam
Temple construction
Andhra Pradesh temples
ISRO
Religious conversions

More Telugu News