Masood Azhar: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: జైషే మహమ్మద్

Masood Azhar Family Decimated in Operation Sindoor Jaish e Mohammed Admits
  • భారత్ దాడిలో అజహర్ కుటుంబం హతం.. తొలిసారి అంగీకరించిన జైషే మహమ్మద్
  • భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో భారీ నష్టం
  • జైష్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ వీడియో ప్రకటన
  • పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌పై మే 7న జరిగిన దాడి
  • దాడిలో అజార్ బంధువులు 10 మంది, సహాయకులు నలుగురు మృతి
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని ఆ సంస్థ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో భాగంగా పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో జరిపిన వైమానిక దాడిలో తమ అధినేత మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది. ఈ మేరకు జైష్ అగ్ర కమాండర్లలో ఒకరైన మసూద్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

మే 7వ తేదీన బహావల్‌పూర్‌లోని జైష్ ప్రధాన కార్యాలయం 'జామియా మసీదు సుభాన్ అల్లా'పై భారత బలగాలు జరిపిన దాడిలో మసూద్ అజహర్ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని ఆ కమాండర్ పేర్కొన్నాడు. "మే 7న భారత బలగాలు మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని ఛిద్రం చేశాయి" అని కశ్మీరీ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడిలో అజహర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మేనకోడలు, ఇతర సమీప బంధువులు మొత్తం 10 మంది మరణించినట్లు సమాచారం. వారితో పాటు అజహర్ ప్రధాన అనుచరులైన నలుగురు సహాయకులు కూడా హతమయ్యారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగానే భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టింది. బహావల్‌పూర్‌తో పాటు మరో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలను కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడిలో మసీదులోని ఒక డోమ్ దెబ్బతిన్నట్లు, లోపల తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.

అయితే, ఈ దాడి గురించి పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, అజహర్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు, అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. ఆ కార్యక్రమానికి మసూద్ అజహర్ కూడా హాజరై కొద్ది నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

పీవోకేలో అజహర్ కదలికలు

మసూద్ అజహర్, 2016 పఠాన్‌కోట్, 2019 పుల్వామా దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాజా నిఘా సమాచారం ప్రకారం, అజహర్ ప్రస్తుతం తన స్థావరమైన బహావల్‌పూర్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్-బల్టిస్థాన్ ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి స్కర్దు ప్రాంతంలో అతని కదలికలను గుర్తించారు. అజహర్ ఆప్ఘనిస్థాన్‌లో ఉండవచ్చని గతంలో పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఈ సమాచారం విరుద్ధంగా ఉంది.
Masood Azhar
Jaish e Mohammed
Operation Sindoor
Bahawalpur
Pakistan
Indian Army

More Telugu News