YS Sharmila: ఆరోగ్యశ్రీని చంపి యూనివర్సల్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రభుత్వం చేసేది మోసం: షర్మిల

YS Sharmila Accuses AP Govt of Killing Aarogyasri for Insurance Scam
  • ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్న షర్మిల
  • ఏడాదిన్నరగా రూ. 2500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని ఆరోపణ
  • ప్రైవేట్ బీమాతో ముడిపెట్టి పథకాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శ
  • ట్రస్ట్ విధానంలోనే ఆరోగ్యశ్రీని కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్
  • ఆసుపత్రుల బకాయిలు వెంటనే చెల్లించి, సమ్మె విరమింపజేయాలని సూచన
  • ప్రజారోగ్యంతో చెలగాటమాడవద్దని ప్రభుత్వానికి హితవు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని, పేదల ఆరోగ్య సంజీవనిగా ఉన్న ఈ పథకాన్ని "అనారోగ్యశ్రీ"గా మార్చిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఆరోపించారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాదిన్నర కాలంగా సుమారు రూ. 2500 కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"పేదల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ మానస పుత్రిక ఈ పథకం. ఆరోగ్యశ్రీ పేద కుటుంబాలకు మరో పునర్జన్మ. ఎంత పెద్ద జబ్బు చేసినా ప్రాణానికి భరోసా. ఇంతటి మహత్తరమైన పథకాన్ని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది. ఏడాదిన్నరగా రూ.2500 వేల కోట్లు బకాయిలు ఆసుపత్రులకు పెండింగ్ పెట్టారంటే ఆరోగ్యశ్రీ అమలుపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో తేటతెల్లమయ్యింది. బకాయిల భారం పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగం. ఆరోగ్యశ్రీని చంపి యూనివర్సల్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రభుత్వం చేసేది మోసం. పథకాన్ని ప్రైవేట్ బీమాతో ముడిపెట్టడం అంటే ప్రజారోగ్యానికి ఎసరు పెట్టడమే. ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అన్నారు. ఇప్పుడు 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రైవేట్ బీమాతో సరిపెడుతున్నారు. 

పేద ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీపై ఇన్ని కుట్రలు ఎందుకు? ఎవరిపై ఈ కక్ష్య? ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ఎవరి లాభం కోసం ఇదంతా చేస్తున్నారు? ఏడాదికి ఆరోగ్యశ్రీ కింద రూ.4వేల కోట్ల కేటాయింపుకి మనసు రాని ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడానికి వేల కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి? ఆరోగ్యశ్రీ కింద 1.60 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే దాని కన్నా.. బీమా కంపెనీలు ఇచ్చేది తక్కువనా? రూ.2.5 లక్షల లోపు ఆరోగ్య బీమా ఏంటి... ఆపై ఖర్చును ట్రస్ట్ చెల్లించడం ఏంటి? 

దేశంలో ప్రైవేట్ బీమా అమలు చేసిన 18 రాష్ట్రాల్లో తిరిగి 16 రాష్ట్రాలు ప్రభుత్వ ట్రస్ట్ విధానానికి మార్చుకున్నాయి. ప్రైవేట్ బీమా భారం తప్ప లాభం కాదని ఒప్పుకున్నాయి. ట్రస్ట్ విధానంలో ఇంతకాలం నడిచే మన రాష్ట్రంలో, ఇప్పుడు ప్రైవేట్ బీమాను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి. వెంటనే ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రైవేట్ కి లింక్ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ట్రస్ట్ విధానంలోనే ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని నడపండి. ఆసుపత్రులకు బకాయిలు పడ్డ రూ.2500 కోట్లను తక్షణం చెల్లించండి. వెంటనే సమ్మెను విరమింపజేయండి. ఉన్నపళంగా ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించేలా చర్యలు చేపట్టండి. ప్రజారోగ్యంపై చెలగాటలు ఆడొద్దని, రాజకీయాలు ఆపాదించవద్దని, ఆరోగ్య శ్రీ సేవలను విస్తరింపజేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల స్పష్టం చేశారు. 
YS Sharmila
Aarogyasri
Andhra Pradesh
AP Congress
Chandrababu Naidu
Universal Insurance
Health Scheme
Healthcare
Medical Insurance
YSR

More Telugu News