Satomi: ఉద్యోగిని ఆత్మహత్య కేసులో సంచలన తీర్పు.. కంపెనీకి రూ.90 కోట్ల జరిమానా

Satomi suicide case Japan court orders company to pay 90 crore fine
  • ఉద్యోగినిని వేధించినందుకు జపాన్ కంపెనీకి భారీ జరిమానా
  • కంపెనీ ప్రెసిడెంట్ మాటలతో మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య
  • 'వీధికుక్క' అని దూషించడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఉద్యోగిని
  • పదవికి రాజీనామా చేసిన కంపెనీ ప్రెసిడెంట్
  • బాధితురాలి కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పిన సంస్థ
కార్యాలయంలో పై అధికారి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో జపాన్ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఉద్యోగిని మృతికి కంపెనీ, దాని ప్రెసిడెంటే బాధ్యులని తేల్చిచెప్పింది. బాధితురాలి కుటుంబానికి 150 మిలియన్ యెన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.90 కోట్లు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. 

వివరాల్లోకి వెళితే, జపాన్‌లోని ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ 'డి-యూపీ కార్పొరేషన్'లో సటోమి (25) అనే యువతి 2021 ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరారు. అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఒక మీటింగ్‌లో, ఆమె ముందస్తు అనుమతి లేకుండా క్లయింట్లను కలిశారని కంపెనీ ప్రెసిడెంట్ మిత్సురు సకై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ముందే ఆమెను 'వీధికుక్క' అంటూ అవమానకరమైన పదజాలంతో దూషించారు. మరుసటి రోజు కూడా అదే తరహాలో వేధించడంతో సటోమి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు.

ఈ ఘటన తర్వాత ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. చికిత్స కోసం సెలవు తీసుకున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు 2022 ఆగస్టులో ఆత్మహత్యాయత్నం చేయగా, కోమాలోకి వెళ్లారు. సుదీర్ఘ కాలం మృత్యువుతో పోరాడి 2023 అక్టోబర్‌లో ప్రాణాలు విడిచారు. తమ కుమార్తె మృతికి కారణమైన కంపెనీపై, ప్రెసిడెంట్‌పై ఆమె తల్లిదండ్రులు న్యాయపోరాటం ప్రారంభించారు.

ఈ కేసుపై విచారణ జరిపిన టోక్యో జిల్లా కోర్టు, సటోమి మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి, ఆమె ఆత్మహత్యకు ప్రెసిడెంట్ మిత్సురు సకై వ్యాఖ్యలే కారణమని నిర్ధారించింది. దీనిని కార్యాలయంలో జరిగిన ప్రమాదంగా పరిగణించింది. కంపెనీ, ప్రెసిడెంట్‌ను బాధ్యులుగా చేస్తూ భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, మిత్సురు సకై వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సకై తన పదవికి రాజీనామా చేయగా, డి-యూపీ కార్పొరేషన్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ విధానాలను సమీక్షించుకుంటామని హామీ ఇచ్చింది. 
Satomi
D-UP Corporation
Mitsuru Sakai
workplace harassment
suicide case
Japan court
employee suicide
Tokyo district court
compensation

More Telugu News