Himanshu Mathur: ఇరాన్‌లో భారతీయుడి కిడ్నాప్.. చిత్రహింసలు

Himanshu Mathur Kidnapped Tortured in Iran Job Scam
  • ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం ఏజెంటును కలిసిన హిమాన్షు
  • భారత్ ఏజెంట్‌తో పాటు హిమాన్షును ఇరాన్‌లో కిడ్నాప్ చేసిన ముఠా
  • రూ. 20 లక్షలు తీసుకుని విడుదల చేసిన ముఠా
ఆస్ట్రేలియాలో ఉద్యోగం వస్తుందనే ఆశతో వెళ్లిన ఒక వ్యక్తిని ఇరాన్‌లో ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఆ ముఠాకు రూ. 20 లక్షలు చెల్లించి అతడిని విడిపించుకున్నామని బాధితుడి కుటుంబం మీడియాకు తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కేరళకు చెందిన బాధితుడు హిమాన్షు మాథుర్ ఉద్యోగం కోసం మొదట అమన్ అనే వ్యక్తిని కలిశాడు.

హర్యానాలోని కర్నాల్‌లో ఇమిగ్రేషన్ సేవలు అందిస్తున్నట్లు అమన్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికెట్ కోర్సు చేస్తే షిప్పింగ్ జాబ్ వస్తుందని హిమాన్షును నమ్మించాడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో వర్క్ వీసాకు మార్గం సుగమం అవుతుందని చెప్పాడు. దీంతో హిమాన్షు నోయిడాలో కోర్సు పూర్తి చేశాడు.

ఆగస్టు ప్రారంభంలో మళ్లీ అమన్.. హిమాన్షును సంప్రదించాడు. తాను ఇండోనేషియాలో ఉన్నానని, రూ. 19 లక్షలకు వీసా ఇవ్వడానికి ఒక ఏజెంట్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. దీంతో హిమాన్షు ఢిల్లీ నుంచి జకార్తాకు వెళ్లాడు. అక్కడ పానిపట్‌కు చెందిన మరో వ్యక్తి విశాల్‌ను కలుసుకున్నాడు.

ఆగస్టు 9న కర్నాల్‌కు చెందిన తమ మనిషి వస్తాడని, అతడికి రూ. 12 లక్షలు ఇవ్వాలని కోరాడు. మిగతా రూ. 7 లక్షలు తర్వాత ఇవ్వమని సూచించాడు. మూడు వారాల తర్వాత హిమాన్షు, అమన్, విశాల్ జకార్తా నుండి ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఒప్పందం ప్రకారం ఆగస్టు 29న అమన్‌తో కలిసి హిమాన్షు టెహ్రాన్ వెళ్లాడు. అక్కడి నుంచి తనను ఆస్ట్రేలియాకు పంపిస్తారని హిమాన్షు భావించాడు.

అక్కడ వీరిని ఒక ముఠా కిడ్నాప్ చేసి చాబహార్‌కు తీసుకు వెళ్లింది. అయితే హిమాన్షుతో ఏజెంట్‌గా పరిచయం చేసుకున్న మిథు అనే వ్యక్తి కూడా ఈ ముఠాలో భాగమని పోలీసులు తెలిపారు.

వారిని మెటల్ పైపులతో కొట్టారని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపి అవయవాలు విక్రయిస్తామని బెదిరించారని హిమాన్షు వాపోయినట్లు పోలీసులు తెలిపారు. హిమాన్షును వేధిస్తున్న సమయంలో కిడ్నాపర్లు అతడి సోదరుడు డింపీకి కూడా వీడియో కాల్ చేశారు. రూ. 1 కోటి డిమాండ్ చేశారని, చివరకు రూ. 20 లక్షలు తీసుకుని విడుదల చేయడానికి ఆ ముఠా అంగీకరించిందని పోలీసులు వెల్లడించారు. కిడ్నాపర్లకు ఇస్తామని చెప్పిన రూ. 20 లక్షలను జలంధర్‌లో మరో వ్యక్తికి బాధిత కుటుంబం అందజేసింది.

ఆ తర్వాత కిడ్నాపర్ల ముఠా హిమాన్షు, అమన్‌లను చాబహార్ విమానాశ్రయం వద్ద వదిలిపెట్టింది. వారు సెప్టెంబర్ 7న ఢిల్లీకి చేరుకున్నారు. హిమాన్షు ఘటన నుంచి కోలుకోలేకపోతున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Himanshu Mathur
Iran kidnapping
kidnapping case
job fraud
Australia job scam
human trafficking

More Telugu News