SBI: లోన్ ఈఎంఐలపై ఎస్‌బీఐ కీలక ప్రకటన

SBI Announces Key Decision on Loan EMIs
  • రుణ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన ఎస్‌బీఐ
  • సెప్టెంబర్ నెలకు పాత రేట్లనే కొనసాగింపు
  • ఎంసీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయని బ్యాంక్
  • యథాతథంగా కొనసాగుతున్న గృహ రుణ వడ్డీ రేట్లు
  • ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన నిర్ణయం
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి కీలక రుణ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం సోమవారం (సెప్టెంబర్ 15) నుంచే అమల్లోకి వచ్చినట్లు ఓ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. వడ్డీ రేట్లలో మార్పు లేకపోవడంతో, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై అదనపు ఈఎంఐ భారం పడదు.

బ్యాంకు తాజా ప్రకటన ప్రకారం, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) స్థిరంగా ఉంచారు. దీని ప్రకారం, ఓవర్‌నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ 7.90 శాతంగా ఉంది. మూడు నెలల కాలపరిమితికి 8.30 శాతం, ఆరు నెలలకు 8.65 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. చాలా వరకు వినియోగదారుల రుణాలు ఆధారపడి ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 8.75 శాతంగా ఉంది. ఇక రెండు, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ వరుసగా 8.8 శాతం, 8.85 శాతంగా కొనసాగుతున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది.

సాధారణంగా ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు. దీనికంటే తక్కువకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు అవకాశం ఉండదు. ఈ రేట్ల మార్పు అనేది ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై రుణాలు తీసుకున్న వారిపై ప్రభావం చూపుతుంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రం ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లు (ఈబీఎల్ఆర్) వర్తిస్తాయి.

ఎంసీఎల్ఆర్‌తో పాటు గృహ రుణ వడ్డీ రేట్లను కూడా ఎస్‌బీఐ స్థిరంగానే ఉంచింది. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేట్లు కనీసం 7.50 శాతం నుంచి గరిష్ఠంగా 8.70 శాతం మధ్య ఉన్నాయి. అయితే, కస్టమర్ల సిబిల్ స్కోర్‌ను బట్టి ఈ వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయని గమనించాలి. అదేవిధంగా, టాప్-అప్ హోమ్ లోన్‌పై 8 శాతం నుంచి 10.75 శాతం వరకు వడ్డీ వర్తిస్తుందని బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది.
SBI
State Bank of India
SBI MCLR
Home Loan Interest Rates
Loan EMI
Interest Rates
EBLR
Marginal Cost of Funds Based Lending Rate
RBI
Loan Rates

More Telugu News