Supreme Court: రాజకీయ పార్టీలు 'పని ప్రదేశాలు' కావు.. లైంగిక వేధింపుల చట్టం వర్తించదు: సుప్రీంకోర్టు

Supreme Court says political parties are not workplaces POSH Act not applicable
  • రాజకీయ పార్టీలను పోష్ చట్టం పరిధిలోకి తెచ్చే పిటిషన్ తిరస్కరణ
  • పార్టీలకు, కార్యకర్తలకు మధ్య యజమాని-ఉద్యోగి సంబంధం ఉండద‌న్న సుప్రీం  
  • కేరళ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్
రాజకీయ రంగంలో పనిచేస్తున్న మహిళలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్) కింద రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజకీయ పార్టీలకు, కార్యకర్తలకు మధ్య యజమాని-ఉద్యోగి సంబంధం ఉండదని, కాబట్టి రాజకీయ పార్టీలను 'పని ప్రదేశం'గా పరిగణించజాలమని సోమవారం స్పష్టం చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. రాజకీయ పార్టీలను 'పోష్' చట్టంలోని 'పని ప్రదేశం' నిర్వచనం కిందకు ఎలా తీసుకురాగలమని ధర్మాసనం ప్రశ్నించింది. పార్టీకి, దాని కార్యకర్తలకు మధ్య యజమాని-ఉద్యోగి బంధం లేనప్పుడు, ఈ చట్టం వర్తింపజేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది.

అడ్వకేట్ యోగమాయ ఎం.జి. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్‌పీ) దాఖలు చేశారు. 2022 మార్చిలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. యజమాని-ఉద్యోగి సంబంధం లేనందున, రాజకీయ పార్టీలు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అప్పట్లో కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

కేరళ హైకోర్టు తీర్పు వల్ల రాజకీయ, సినీ, మీడియా వంటి అనధికారిక రంగాలలో పనిచేస్తున్న ఎంతో మంది మహిళలు పోష్ చట్టం రక్షణకు దూరమవుతున్నారని పిటిషనర్ వాదించారు. 'యజమాని', 'ఉద్యోగి', 'పని ప్రదేశం' వంటి పదాలకు చట్టంలో విస్తృత అర్థం ఉందని, కానీ హైకోర్టు తీర్పు దాని స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19(1)(g), 21 కింద కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో ఆరోపించారు.

గత నెలలో కూడా ఇదే తరహా ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనమే తిరస్కరించింది. అయితే, కేరళ హైకోర్టు తీర్పును ప్రత్యేకంగా ఎస్ఎల్‌పీ ద్వారా సవాలు చేయవచ్చని అప్పుడు సూచించింది. కాగా, గతేడాది డిసెంబర్‌లో ఇలాంటి మరో పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించడం గమనార్హం.
Supreme Court
Sexual Harassment Act
POSH Act
political parties
Kerala High Court
BR Gavai
internal complaints committee
employee employer relationship
workplace harassment

More Telugu News