Assam Earthquake: భూమి కంపించినా కదలలేదు.. పసికందులకు రక్షణ కవచంలా మారిన నర్సులు!

Assam Earthquake Nurses Save Babies During Earthquake
  • అసోంలో 5.8 తీవ్రతతో భారీ భూకంపం
  • ఆసుపత్రిలో పసికందులను కాపాడిన ఇద్దరు నర్సులు
  • భూమి కంపిస్తున్నా శిశువులకు అండగా నిలిచిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్
  • నర్సుల ధైర్యసాహసాలపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
అసోంలో నిన్న సాయంత్రం 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఈ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి నవజాత శిశువుల ప్రాణాలను కాపాడిన ఇద్దరు నర్సుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారి ధైర్యానికి, మానవత్వానికి విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి.

నాగావ్ నగరంలోని ఆదిత్య నర్సింగ్ హోమ్‌లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో రికార్డయిన ఈ వీడియో భూకంపం వచ్చిన సమయంలో అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టింది. సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో భూమి కంపించడం మొదలుకాగానే ఆ ఇద్దరు నర్సులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా శిశువుల వద్దకు పరుగెత్తారు.

వార్డులోని వస్తువులు, అద్దం, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర వైద్య పరికరాలు తీవ్రంగా ఊగిపోతున్నప్పటికీ, వారు తమ ప్రాణాలను లెక్కచేయకుండా శిశువులను పట్టుకున్నారు. ఒక నర్సు ఇద్దరు శిశువులను కాపాడగా, మరో నర్సు ఒక శిశువుకు తన చేతులతో కవచంలా అడ్డుగా నిలబడింది. భూకంపం ఆగే వరకు కూడా వారు ధైర్యం కోల్పోకుండా, శిశువులను తమ చేతుల్లోనే సురక్షితంగా ఉంచుకున్నారు.

ఈ భూకంప కేంద్రం ఉదల్గురి జిల్లాలో 5 కిలోమీటర్ల లోతున నమోదైంది. గువాహటి, ఉదల్గురి, సోనిత్‌పూర్, తముల్పూర్, నల్బరీతో పాటు అనేక జిల్లాల ప్రజలు భయాందోళనలతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. దీని తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో రెండు స్వల్ప భూకంపాలు కూడా సంభవించాయి. ఒకటి 3.1 తీవ్రతతో 4:58 గంటలకు, మరొకటి 2.9 తీవ్రతతో 5:21 గంటలకు నమోదయ్యాయి. ఈ ప్రకంపనలు మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంభవించాయి. కష్టకాలంలోనూ తమ విధిని మరువకుండా, చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆ నర్సుల ధైర్యం అందరికీ స్ఫూర్తినిస్తోంది.
Assam Earthquake
Assam
Earthquake
Nagaon
Nurses
Neonatal Intensive Care Unit
NICU
Infants
Guwahati
Viral Video

More Telugu News