Semaglutide: బరువు తగ్గించే మందు.. అధిక డోసుతో అదనపు ప్రయోజనం

Higher doses of semaglutide safe can aid in better weight loss for obese adults Says Study
  • బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ మందుపై కీలక అధ్యయనం
  • ప్రస్తుతం వాడుతున్న డోసు కంటే 7.2 mg డోసుతో మెరుగైన ఫలితాలు
  • డయాబెటిస్ లేనివారిలో ఏకంగా 19 శాతం వరకు బరువు తగ్గుదల
  • అధిక డోసు వాడకం సురక్షితమేనని తేల్చిన అంతర్జాతీయ పరిశోధకులు
  • వికారం, డయేరియా వంటి స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే నమోదు
  • బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ స్థాయిల్లోనూ గణనీయమైన మెరుగుదల
ఊబకాయం, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి వైద్య ప్రపంచం ఓ శుభవార్త అందించింది. బరువు తగ్గించడానికి వాడే సెమాగ్లుటైడ్ ఔషధాన్ని అధిక మోతాదులో తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. ప్రస్తుతం ఆమోదం పొందిన 2.4 మిల్లీగ్రాముల డోసుతో పోలిస్తే, 7.2 మిల్లీగ్రాముల వారపు డోసు సురక్షితంగా ఉండటమే కాకుండా, బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తున్నట్టు సోమవారం ప్రఖ్యాత 'ది లాన్సెట్ డయాబెటిస్ & ఎండోక్రైనాలజీ' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

కెనడా, అమెరికా, డెన్మార్క్ సహా పలు దేశాల పరిశోధకులు రెండు భారీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ప్రయోగాల్లో భాగంగా డయాబెటిస్ లేని ఊబకాయులకు 7.2 mg డోసు ఇవ్వగా, వారిలో సగటున 19 శాతం శరీర బరువు తగ్గింది. ఇదే సమయంలో 2.4 mg డోసు తీసుకున్న వారిలో 16 శాతం బరువు తగ్గగా, ఎలాంటి మందు తీసుకోని వారిలో కేవలం 4 శాతం తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా, అధిక డోసు తీసుకున్న వారిలో దాదాపు సగం మంది 20 శాతానికి పైగా బరువు తగ్గగా, మూడో వంతు మంది ఏకంగా 25 శాతం బరువు కోల్పోవడం గమనార్హం. కేవలం బరువు తగ్గడమే కాకుండా వీరిలో నడుము చుట్టుకొలత, రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయులు కూడా గణనీయంగా మెరుగుపడినట్లు పరిశోధకులు తెలిపారు.

అలాగే, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఊబకాయుల్లో కూడా ఈ అధిక డోసు చక్కగా పనిచేసింది. 7.2 mg డోసు తీసుకున్న వారిలో సగటున 13 శాతం బరువు తగ్గగా, 2.4 mg డోసుతో 10 శాతం తగ్గుదల నమోదైంది. వీరిలో రక్తంలో చక్కెర స్థాయులు, నడుము చుట్టుకొలత కూడా బాగా తగ్గినట్టు తేలింది.

ఈ అధిక డోసు వాడకం వల్ల కొన్ని స్వల్ప దుష్ప్రభావాలు కనిపించినా, అవి ప్రమాదకరమైనవి కావని పరిశోధకులు స్పష్టం చేశారు. వికారం, డయేరియా, ఒంట్లో సూదులతో గుచ్చినట్లు అనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయని, అయితే అవి కొద్దికాలంలోనే తగ్గిపోయాయని వివరించారు. ఈ అధిక డోసు వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు గానీ, హైపోగ్లైసీమియా (షుగర్ లెవెల్స్ పడిపోవడం) వంటివి గానీ పెరగలేదని నిర్ధారించారు. ఈ కొత్త డోసు ఊబకాయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న లక్షలాది మందికి ఒక వరంలా మారుతుందని, అయితే దీని దీర్ఘకాలిక ప్రయోజనాలు, నష్టాలపై మరింత పరిశోధన అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Semaglutide
weight loss
obesity
type 2 diabetes
diabetes
The Lancet Diabetes & Endocrinology
clinical trials
blood sugar
cholesterol
metabolic health

More Telugu News