Harjit Kaur: 30 ఏళ్లకు పైగా అమెరికాలో ఉంటున్న పంజాబీ వృద్ధురాలి అరెస్ట్.. స్థానికుల నిరసన

Harjit Kaur 73 Year Old Arrested in US After 30 Years
  • 1992 లో ఇద్దరు పిల్లలతో అమెరికా చేరుకున్న హర్జిత్ కౌర్
  • రాజకీయ ఆశ్రయం కోసం కౌర్ దరఖాస్తు.. 2012లో తిరస్కరణ
  • 6 నెలలకు ఓసారి ఇమిగ్రేషన్ ఆఫీసులో హాజరవుతున్న కౌర్
  • తాజాగా హర్జిత్ ను అరెస్టు చేసి జైలుకు పంపిన అధికారులు
అక్రమ వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి, వారిని జైలుకు తరలించడం లేదా స్వదేశానికి పంపించడం చేస్తున్నారు. 

ఈ క్రమంలో నార్తర్న్ కాలిఫోర్నియాలోని ఈస్ట్ బేలో నివాసం ఉంటున్న హర్జిత్ కౌర్ (73)ను అధికారులు గత సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేవని ఆమెను జైలుకు పంపించారు. దీనిపై కౌర్ కుటుంబ సభ్యులతో పాటు స్థానిక పంజాబీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వంద మందికి పైగా గుంపుగా ఇమిగ్రేషన్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి, కౌర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే..
పంజాబ్ కు చెందిన హర్జిత్ కౌర్ 1992లో ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో అడుగుపెట్టారు. రాజకీయ ఆశ్రయం కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక అనుమతితో నార్తర్న్ కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. 2012లో ప్రభుత్వం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. భారత్ కు తిప్పిపంపేందుకు పేపర్ వర్క్ జరుగుతున్న క్రమంలో కౌర్ అక్కడే ఉండొచ్చని ఇమిగ్రేషన్ అధికారులు చెప్పారు. అప్పటి నుంచి ప్రతీ 6 నెలలకు ఒకసారి హర్జిత్ కౌర్ ఇమిగ్రేషన్ ఆఫీసుకు వెళ్లి హాజరు వేయించుకుంటున్నారు.

గడిచిన 30 ఏళ్లలో హర్జిత్ కౌర్ స్థానిక చట్టాలకు అనుగుణంగా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా జీవించారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు లేదా నేరాలకు పాల్పడలేదు. ఈ క్రమంలో సోమవారం ఈస్ట్ బేలో తనిఖీలు చేపట్టిన ఇమిగ్రేషన్ అధికారులు.. హర్జిత్ కౌర్ వద్ద నివాస అనుమతి పత్రాలు లేవని గుర్తించారు. మొదట ఆమెను ఇమిగ్రేషన్ ఆఫీసుకు తరలించిన అధికారులు.. విచారణ తర్వాత జైలుకు పంపించారు. ఈ సంఘటనతో హర్జిత్ కౌర్ కుటుంబ సభ్యులతో పాటు స్థానిక పంజాబీలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సుమారు వంద మంది ఇమిగ్రేషన్ ఆఫీసు ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
Harjit Kaur
Harjit Kaur arrest
US immigration
California
illegal immigration
Donald Trump
Punjabi community
political asylum
immigration protest
East Bay

More Telugu News