AP DSC: నేడు మెగా డీఎస్సీ ఎంపిక జాబితా విడుద‌ల‌

Mega DSC 2025 Selection List Released Today by AP Education Department
  • మొత్తం 16,347 పోస్టులకు గాను 16 వేల మంది ఎంపిక
  • అభ్యర్థులు లేక 300కు పైగా పోస్టులు మిగిలిపోయిన వైనం
  • ఈ నెల 19న అమరావతిలో భారీ సభ, నియామక పత్రాల పంపిణీ
  • సెప్టెంబర్ 22 నుంచి కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు
  • దసరా సెలవుల అనంతరం విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులు
మెగా డీఎస్సీ-2025 అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజుతో తెరపడనుంది. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ నేడు విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది అభ్యర్థుల పేర్లతో కూడిన ఈ జాబితాలను జిల్లాల కలెక్టర్, డీఈఓ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో పాటు అధికారిక వెబ్‌సైట్ cse.apcfss.in లో కూడా అందుబాటులో ఉంచుతామని డీఎస్సీ-2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి నిన్న‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, సుమారు 16 వేల పోస్టులను భర్తీ చేయగలిగారు. కొన్ని మేనేజ్‌మెంట్లు, పలు సామాజిక వర్గాల్లో అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 300కు పైగా పోస్టులు మిగిలిపోయినట్లు అధికారులు తెలిపారు. మొదట 600కు పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఉండగా, వీలైనన్ని ఎక్కువ పోస్టులను భర్తీ చేసేందుకు ఏడు విడతలుగా సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. మిగిలిపోయిన ఈ పోస్టులను తదుపరి డీఎస్సీలో భర్తీ చేయనున్నారు.

ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతి సచివాలయం సమీపంలో భారీ కార్యక్రమం నిర్వహించి సీఎం చంద్ర‌బాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి 30 వేల మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దసరా సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున వీరంతా విధుల్లో చేరేలా విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ 20న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, జూన్ 6 నుంచి జులై 2 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి గుర్తుచేశారు. మొత్తం 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు అందాయని ఆయన వివరించారు.
AP DSC
Chandrababu
Mega DSC 2025
Teacher Recruitment
Andhra Pradesh Education
School Education Department
MV Krishna Reddy
Government Jobs
Amaravati
Teacher Training

More Telugu News