Raghurama Krishnam Raju: జగన్ కోరికకు అనుగుణంగా ఇక్కడ విధివిధానాలు లేవు: రఘురామకృష్ణరాజు

Raghurama Krishnam Raju says rules not bent for Jagan
  • ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ
  • జగన్‌కు ప్రతిపక్ష హోదా కల్పించడానికి అవసరమైన నిబంధనలు లేవన్న రఘురామ
  • జగన్ ఇప్పటివరకు కేవలం 37 రోజులు మాత్రమే సభకు హాజరుకాలేదన్న రఘురామ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "జగన్ కోరికల మేరకు అసెంబ్లీలో విధివిధానాలు రూపొందించలేము" అని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష హోదా కోరుతున్న జగన్ ఆ కోరికపై పదే పదే పట్టుబడుతున్నారని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హోదా కల్పించడానికి అవసరమైన నిబంధనలు లేవని ఆయన తేల్చి చెప్పారు. "నియమాలు ఉల్లంఘించలేము. వ్యవస్థగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం" అని రఘురామకృష్ణరాజు అన్నారు.

అసెంబ్లీకి గైర్హాజరు అంశాన్ని ప్రస్తావిస్తూ, "ఒక ఎమ్మెల్యే వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే మాత్రమే అనర్హతపై చర్యలు తీసుకోవచ్చని రాజ్యాంగం చెబుతోంది. జగన్ ఇప్పటివరకు కేవలం 37 రోజులు మాత్రమే సభకు హాజరు కాలేదు. కనుక వెంటనే ఆయనపై అనర్హత చర్యలు చేపట్టే పరిస్థితి లేదు" అని వివరించారు.

అయితే, జగన్ మిగతా రోజుల్లో కూడా సభకు హాజరుకాకపోతే, రాజ్యాంగ నిబంధనల మేరకు అనర్హులు అవుతారని చెప్పవలసిన బాధ్యత తమ వ్యవస్థపై ఉందని ఆయన అన్నారు. అందుకే గుర్తు చేస్తున్నామని తెలిపారు. అయితే 60 రోజుల పాటు అసెంబ్లీకి జగన్ హాజరుకాకపోతే సభాధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
Raghurama Krishnam Raju
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Assembly
Deputy Speaker
MLA Disqualification
Assembly Rules
Opposition Status
Andhra Pradesh Politics
Assembly Sessions

More Telugu News