Jagapathi Babu: జగపతిబాబుకు సవాల్ విసిరిన కపిల్ శర్మ!

Jagapathi Babu Challenged by Kapil Sharma on Show
  • కపిల్ శర్మ షోలో 'మిరాయ్' చిత్ర బృందం సందడి
  • రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోనన్న జగపతి బాబు
  • అక్కడ నాకంటే పెద్ద విలన్లు ఉన్నారంటూ సెటైర్
  • తన సినిమాల పేర్లు చెప్పే టాస్క్‌లో నవ్వించిన జగ్గూభాయ్
  • భర్తతో తొలి పరిచయాన్ని వివరించిన శ్రియ సరన్
  • 'దృశ్యం' చూసి తన భర్త భయపడ్డాడన్న నటి
ప్రముఖ నటుడు జగపతి బాబు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దక్షిణాది నటులు రాజకీయాల్లోకి రావడం సహజమేనని, తాను రాజకీయాల్లోకి వస్తే మాత్రం విలన్ నుంచి హీరో అవుతానని ఆయన అన్నారు. "ఇప్పటివరకు నేను సినిమాల్లో విలన్‌గా చేశాను. ఒకవేళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే మాత్రం హీరో అవుతాను. ఎందుకంటే అక్కడ నాకంటే పెద్ద విలన్లు చాలా మంది ఉన్నారు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సెట్‌లో నవ్వులు విరిశాయి.

ప్రముఖ హిందీ టాక్ షో "ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో"లో 'మిరాయ్' చిత్ర బృందంతో కలిసి జగపతి బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్ శర్మ ఆయనకు ఓ సరదా సవాల్ విసిరారు. 170కి పైగా చిత్రాల్లో నటించిన జగపతి బాబు, తాను నటించిన సినిమాల పేర్లన్నీ మూడు సెకన్ల విరామం మించకుండా ఏకధాటిగా చెప్పాలని కోరారు. దీనికి అంగీకరించిన జగ్గూభాయ్.. 'మంచి మనుషులు', 'సింహ స్వప్నం', 'అడవిలో అభిమన్యుడు', 'పెద్దరికం', 'జగన్నాటకం', 'శుభలగ్నం' అంటూ కొన్ని పేర్లు చెప్పి ఆగిపోయారు. ఆ తర్వాత "నేను ఏది పడితే అది చెప్పినా ఎవరికీ తెలియదు కదా" అని చమత్కరించడంతో అక్కడున్న వారంతా కడుపుబ్బా నవ్వారు.

ఇదే కార్యక్రమంలో నటి శ్రియ సరన్ తన భర్త ఆండ్రీ కోస్చీవ్‌తో జరిగిన తొలి పరిచయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "నేను పొరపాటున తప్పుడు నెలలో తప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవడంతో మాల్దీవుల క్రూయిజ్‌లో ఒంటరిగా మిగిలిపోయాను. అక్కడే నాకు ఆండ్రీ పరిచయమయ్యాడు. మేమిద్దరం కలిసి డైవింగ్ చేయడం మొదలుపెట్టాం. అలా మా ప్రయాణం మొదలైంది" అని ఆమె తెలిపారు. తన భర్త చూసిన మొట్టమొదటి తెలుగు సినిమా 'దృశ్యం' అని, ఆ సినిమా చూసి ఆయన చాలా భయపడ్డాడని శ్రియ చెప్పి నవ్వించారు.

ఈ సరదా సంభాషణలో యువ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ, జగపతి బాబు మనసులో చాలా రొమాంటిక్ అని చెప్పగా, కపిల్ శర్మ తనదైన శైలిలో హాస్యం పండించారు. 'మిరాయ్' సినిమా ప్రమోషన్ కోసం ఈ షోలో పాల్గొన్న తేజ సజ్జా, శ్రియ, జగపతి బాబు, రితికా నాయక్ తమ కబుర్లతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
Jagapathi Babu
Kapil Sharma
The Great Indian Kapil Sharma Show
Mirai Movie
Shriya Saran
Andrei Koscheev
Teja Sajja
Telugu Cinema
Politics
Comedy

More Telugu News