Asia Cup 2025: ఆసియా కప్: పాకిస్థాన్ తడబాటు.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్

Asia Cup 2025 Easy Target for India Against Pakistan
  • ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
  • భారత బౌలర్ల ధాటికి 127 పరుగులకే పరిమితం
  • మూడు వికెట్లతో చెలరేగిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
  • చివర్లో మెరుపులు మెరిపించిన షాహీన్ అఫ్రిది
  • టీమిండియా విజయ లక్ష్యం 128 పరుగులు
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌ను టీమిండియా బౌలర్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే కట్టడి చేశారు. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ మాయాజాలంతో పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే పాకిస్థాన్‌కు భారీ షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన తొలి బంతికే సయీమ్ అయూబ్ (0) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు ఎవరూ నిలకడగా రాణించలేకపోయారు. భారత బౌలర్ల క్రమశిక్షణాయుతమైన బౌలింగ్‌కు పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (44 బంతుల్లో 40) నెమ్మదిగా ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు.

ముఖ్యంగా భారత స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మధ్య ఓవర్లలో పాక్‌ను తీవ్రంగా దెబ్బతీశారు. కుల్దీప్ యాదవ్ కేవలం 18 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ కూడా 18 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వీరి ధాటికి పాక్ ఒక దశలో 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయితే, చివర్లో క్రీజులోకి వచ్చిన షాహీన్ అఫ్రిది ఊహించని విధంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 4 సిక్సర్లతో అజేయంగా 33 పరుగులు చేసి జట్టు స్కోరును 120 పరుగులు దాటించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ వల్లే పాకిస్థాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. ఈ సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా కాసేపట్లో బరిలోకి దిగనుంది.
Asia Cup 2025
India vs Pakistan
Kuldeep Yadav
Axar Patel
Shaheen Afridi
Jasprit Bumrah
Hardik Pandya
Dubai Cricket Stadium
Cricket
T20

More Telugu News