Bangalore school children: టైమంతా బస్సులోనే గడిచిపోతోంది.. బెంగళూరు స్కూలు పిల్లల వీడియో

Bangalore School Children Video Shows Bus Commute Issues
  • స్కూలులో కన్నా బస్సులోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం..
  • రోడ్లు బాలేవు.. ట్రాఫిక్ లో గంటల తరబడి ప్రయాణం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బాలికల వీడియో
స్కూలులో గడిపే సమయం కన్నా బస్సులోనే ఎక్కువ టైమ్ గడపాల్సి వస్తోందని బెంగళూరుకు చెందిన ఓ స్కూలు పిల్లలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. బస్సులో వెనక సీట్లో కూర్చున్న ముగ్గురు అమ్మాయిలు ఫోన్ లో ఈ వీడియోను రికార్డు చేశారు. స్కూలు నుంచి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో తమ ఇల్లు ఉందని, ఉదయం పూట 20 నిమిషాల్లో స్కూలుకు చేర్చే బస్సు.. సాయంత్రం మాత్రం గంటన్నర నుంచి రెండున్నర గంటలు సమయం తీసుకుంటుందని చెప్పారు. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణిస్తుంటే బస్సులో కూర్చున్న తాము అప్పుడప్పుడు ఎగిరిపడుతుంటామని చెప్పారు.

పిల్లలు మాట్లాడుతుండగానే బస్సు ఓ గుంతలో నుంచి వెళ్లడంతో ఫోన్ తలకిందులు కావడం వీడియోలో కనిపిస్తోంది. ఇది తమకు నిత్యకృత్యంగా మారిందని, తామేమీ అబద్ధం చెప్పడంలేదని ఆ పిల్లలు వివరించారు. స్కూలులో కన్నా బస్సులోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోందని, దీనివల్ల ఆటలకు సమయమే మిగలడంలేదని చెప్పారు. ఆటల సంగతి వదిలేస్తే హోంవర్క్ చేసుకోవడానికి, చదువుకోవడానికీ టైముండడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రయాణం వల్ల శారీరకంగా అలసిపోవడంతో పాటు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లు వారు వాపోయారు. కాగా, సాయంత్రం అప్ లోడ్ చేసిన ఈ వీడియోను రాత్రి పొద్దుపోయేలోపు ఏకంగా 8 లక్షల మందికి పైగా వీక్షించారు.
 
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు స్పందిస్తూ.. త్వరలో ఓటర్లుగా మారబోయే ఈ చిన్నారులు ఈరోజు తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తుంచుకుని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఆశిస్తున్నట్లు ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ పిల్లల ఆత్మవిశ్వాసం, తమ సమస్యను ధైర్యంగా, స్పష్టంగా, మర్యాదపూర్వకంగా చెప్పిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Bangalore school children
Bangalore
school bus
traffic
road conditions
student video
viral video
commute problems
education
student issues

More Telugu News