Revanth Reddy: ఏపీ అక్రమ తరలింపును ఆధారాలతో సహా కృష్ణా ట్రైబ్యునల్ ముందుంచాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy demands evidence of AP illegal water diversion before Krishna Tribunal
  • కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరాలన్న ముఖ్యమంత్రి
  • రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని వ్యాఖ్య
  • నీటి వాటాను సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపణ
కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను తరలించుకుపోయిందని, ఏపీ అక్రమ తరలింపును ఆధారాలతో సహా కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ముందు నివేదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ విచారణ జరగనున్న నేపథ్యంలో, ట్రైబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు గట్టిగా పట్టుబట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన బలమైన వాదనలను వినిపించాలని ఆయన అన్నారు. కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ట్రైబ్యునల్ ముందుంచాలని ఆదేశించారు. గతంలో సరైన శ్రద్ధ కనబరచకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అన్నారు.

కృష్ణా జలాల్లో వాటా సాధించడంలో కేసీఆర్ విఫలమయ్యారని, నీటి వాటాల విషయంలో ఆయన తెలంగాణకు ద్రోహం చేశారని విమర్శించారు. పాలమూరు, దిండి వంటి అనేక ప్రాజెక్టులను పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు.
Revanth Reddy
Krishna River
Krishna Tribunal
AP Telangana water dispute
Telangana water share

More Telugu News