Madhusudhan Reddy: బీఆర్ఎస్ చచ్చిపోయింది... కేటీఆర్ ను చూస్తే జాలి వేస్తోంది: మధుసూదన్ రెడ్డి

Madhusudhan Reddy Criticizes KTR Says BRS is Dead
  • కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే కేటీఆర్ బయట తిరుగుతున్నారని ఎద్దేవా
  • బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని లేపనాలు పూసినా బతకదని ఘాటు విమర్శ
  • కేటీఆర్ పర్యటనలతో డీజిల్ ఖర్చు తప్ప ఉపయోగం శూన్యమని సెటైర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను చూస్తే తనకు జాలి కలుగుతోందని దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ గద్వాల పర్యటన నేపథ్యంలో ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఇంట్లోనూ, ఫామ్‌హౌస్‌లోనూ ఉండలేని పరిస్థితుల్లోనే కేటీఆర్ గాలికి తిరగడానికి బయటకు వచ్చారని అన్నారు.

కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకోలేకే ఆయన జిల్లాల బాట పట్టారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. "ఒకవైపు సోదరి కవిత, మరోవైపు బావ హరీశ్‌రావు, ఇంకోవైపు తండ్రి కేసీఆర్ నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కేటీఆర్ సతమతమవుతున్నారు. ఏం చేయాలో తెలియక, పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటుండటంతో ఇలా పర్యటనలు చేస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని, ఈ నిజాన్ని కేటీఆర్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదని హితవు పలికారు. ఆ పార్టీకి ఎన్ని లేపనాలు పూసినా లాభం లేదని, అవినీతి కంపు తప్ప మరో వాసన రాదని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేటీఆర్ పర్యటనల వల్ల డీజిల్ ఖర్చు తప్ప మరే ప్రయోజనం లేదని, సోషల్ మీడియాలో స్టంట్ల కోసమే ఆయన సభలు పెడుతున్నారని ఆరోపించారు.

"బీఆర్ఎస్ చెప్పే చెత్త కబుర్లు వినడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన పాలమూరు ప్రజలు వారిని ఫామ్‌హౌస్‌కు పంపారు. వారి హయాంలో పాలమూరు-రంగారెడ్డి, తుమ్మడిహట్టి, జూరాల వంటి కీలక ప్రాజెక్టులను గాలికొదిలేశారు" అని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జూరాలపై రూ. 120 కోట్లతో కొత్త వంతెన నిర్మిస్తోందని తెలిపారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ ప్రాంతానికి ఏ పార్టీ అవసరం లేదన్నారు. పదేళ్ల పాటు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మింగేసిన బకాసురులు బీఆర్ఎస్ నేతలని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
Madhusudhan Reddy
KTR
BRS
Telangana Congress
Kavitha
Harish Rao
KCR
Devarakadra
Telangana Politics
Palamuru

More Telugu News