Sakshi Chawla: గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదం: 13వ అంతస్తు నుంచి దూకి తల్లీకొడుకు ఆత్మహత్య

Sakshi Chawla Mother and Son Suicide in Greater Noida
  • కొడుకు మానసిక అనారోగ్యంతో తల్లి తీవ్ర మనస్తాపం
  • 'ప్రపంచాన్ని విడిచి వెళ్లాలనుకుంటున్నా' అని సూసైడ్ నోట్
  • ఘటనాస్థలిలోనే ఇద్దరూ అక్కడికక్కడే మృతి
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శనివారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని చూసి తట్టుకోలేకపోయిన ఒక తల్లి, తన కుమారుడితో కలిసి ఒక బహుళ అంతస్తుల భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏస్ సిటీ సొసైటీలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సొసైటీలోని 13వ అంతస్తులో నివసిస్తున్న సాక్షి చావ్లా (37), ఆమె 11 ఏళ్ల కుమారుడు దక్ష్‌తో కలిసి కిందకు దూకేశారు. తీవ్ర గాయలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. "ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లాలని ఉంది" అని సాక్షి ఆ నోట్‌లో రాసినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో దక్ష్ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. కుమారుడి పరిస్థితి చూసి సాక్షి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనతో సొసైటీ వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయాన్నే జరిగిన ఈ దుర్ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Sakshi Chawla
Greater Noida
Ace City Society
Suicide
Mother son suicide
Mental health
Depression

More Telugu News